
వారికి తగినంత సమయం ఇవ్వాలి
తొలి టెస్టు ప్రదర్శనపై భారత జట్టు హెడ్ కోచ్ గంభీర్ వ్యాఖ్య
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు పరాజయానికి పేలవమైన పేస్ బౌలింగ్ కూడా ఒక కారణం. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా మినహా మిగితా వారంతా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ సమష్టిగా విఫలమయ్యారు. ప్రసిధ్ అయితే ఏకంగా ఓవర్‌కు ఆరుకు పైగా పరుగులు ఇచ్చాడు. అయితే భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తమ పేసర్లకు అండగా నిలిచాడు. ఒక్క ఓటమికే వారిని నిందించడం భావ్యం కాదని అతను పేర్కొన్నాడు.
‘గతంలో భారత జట్టులో నలుగురు పేసర్లు ఉంటే వారంతా ఒక్కొక్కరు కనీసం 40 టెస్టుల అనుభవంతో ఉండేవారు. వన్డేలు, టి20ల్లో సమస్య లేకపోవచ్చు కానీ ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలాంటి చోట టెస్టులు ఆడేటప్పుడు అనుభవం ఎంతో కీలకం. బుమ్రా, సిరాజ్‌లకు కొంత అనుభవం ఉన్నా ప్రసిధ్ నాలుగు టెస్టులే ఆడాడు. తుది జట్టులో లేనివారిని చూసినా నితీశ్ రెడ్డికి ఐదు, హర్షిత్‌కు రెండు టెస్టుల అనుభవం మాత్రమే ఉండగా అర్‡్షదీప్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది ఆరంభం మాత్రమే. వారు తమ ఆటను మెరుగు పర్చుకునేందుకు తగినంత సమయం ఇవ్వాలి.
ప్రతీ టెస్టు తర్వాత లోపాలను వెతికితే బలమైన బౌలింగ్ బృందాన్ని ఎలా తయారు చేయగలం. వారిలో తగినంత ప్రతిభ ఉంది కాబట్టే జట్టులోకి ఎంపికై ఇక్కడ ఉన్నారు’ అని గంభీర్ సమర్థించాడు. తొలి నాలుగు రోజుల పాటు బౌలర్లు కూడా రాణించడం వల్లే భారత జట్టు ఆధిక్యం ప్రదర్శించగలిగిందని, వారిపై తనకు నమ్మకం ఉందని అతను అన్నాడు. ప్రసిధ్ కూడా బాగానే బౌలింగ్ చేశాడని... అతనితో పాటు శార్దుల్ కూడా కీలకదశలో రెండేసి వికెట్లు తీశారని గంభీర్ గుర్తు చేశాడు. ఫలానా ఆటగాళ్ల వల్లే తాము ఓడిపోయామంటూ ఎవరినీ బాధ్యులను చేయనన్న కోచ్... తాము గెలిచినా ఓడినా అందులో అందరి పాత్ర ఉంటుందని వెల్లడించాడు.
కెప్టెన్‌గా తొలి టెస్టులో ఒత్తిడి సహజమన్న గంభీర్... మున్ముందు గిల్ చాలా నేర్చుకొని మంచి ఫలితాలు రాబడతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ పర్యటనలో తాము ముందుగా అనుకున్నట్లుగా బుమ్రా మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని, మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో ఏ రెండు ఆడించాలనే విషయంపై టీమ్ మేనేజ్‌మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోచ్ వెల్లడించాడు. తొలి టెస్టులో పంత్ రెండు సెంచరీలు సాధించిన విషయంపై మాట్లాడుతూ... ‘పంత్ మాత్రమే కాదు. మరో ముగ్గురు కూడా సెంచరీలు సాధించారనే విషయం మరచిపోవద్దు. అయినా జట్టు గెలవనప్పుడు వ్యక్తిగత ప్రదర్శనలకు విలువ లేదు’ అని గంభీర్ కాస్త ఘాటుగా జవాబిచ్చాడు.