
హాంగ్జౌ (చైనా): ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ లీగ్ దశను భారత జట్టు అజేయంగా ముగించింది. సింగపూర్ జట్టుతో సోమవారం జరిగిన పూల్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 12–0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవ్‌నీత్ కౌర్ (14వ, 20వ, 28వ నిమిషాల్లో), ముంతాజ్ ఖాన్ (2వ, 32వ, 39వ నిమిషాల్లో) మూడు గోల్స్ చొప్పున చేశారు.
నేహా (11వ, 38వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించింది. లాల్‌రెమ్‌సియామి (13వ నిమిషంలో), ఉదిత (29వ నిమిషంలో), షరి్మలా (45వ నిమిషంలో), రుతుజా (53వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. థాయ్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 11–0తో నెగ్గిన భారత్... జపాన్‌తో రెండో మ్యాచ్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకుంది. పూల్ ‘బి’లో భారత్, జపాన్ జట్లు ఏడు పాయింట్లతో సమంగా నిలిచినా... ఎక్కువ గోల్స్ చేసిన భారత్‌కు అగ్రస్థానం ఖాయమైంది. జపాన్‌కు రెండో స్థానం దక్కింది.
పూల్ ‘బి’ నుంచి భారత్, జపాన్... పూల్ ‘ఎ’ నుంచి చైనా, దక్షిణ కొరియా జట్లు ‘సూపర్–4’ దశకు అర్హత సాధించాయి. బుధవారం జరిగే ‘సూపర్–4’ మ్యాచ్‌ల్లో కొరియాతో భారత్; జపాన్‌తో చైనా తలపడతాయి. ‘సూపర్–4’ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత పొందుతాయి. విజేత జట్టు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధిస్తుంది.