మన బాణం బంగారం | India win womens recurve team gold medal In Archery World Cup | Sakshi
Sakshi News home page

మన బాణం బంగారం

May 11 2026 5:46 AM | Updated on May 11 2026 8:22 AM

India win womens recurve team gold medal In Archery World Cup

ప్రపంచకప్‌ ఆర్చరీ టోర్నీలో భారత మహిళల జట్టుకు స్వర్ణం 

షాంఘై (చైనా): ఐదేళ్ల నిరీక్షణకు భారత మహిళల ఆర్చరీ జట్టు తెరదించింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్‌ స్టేజ్‌–2 టోర్నీలో మహిళల టీమ్‌ రికర్వ్‌ విభాగంలో టీమిండియా భారత జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లో పోటీపడ్డ ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ దీపిక కుమారి, అంకిత, కుంకుమ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–4 (54–53, 52–55, 56–57, 54–53, 28–26) సెట్‌ పాయింట్లతో జు జింగీ, యు కి, హువాంగ్‌ యువెలతో కూడిన ఆతిథ్య చైనా జట్టును ఓడించింది. 

తొలి సెట్‌ను నెగ్గిన భారత్‌ 2–0తో ముందంజ వేయగా... రెండో సెట్‌ను గెలిచి చైనా స్కోరును 2–2తో సమం చేసింది. మూడో సెట్‌ను కోల్పోయి 2–4తో వెనుకబడ్డ భారత్‌ నాలుగో సెట్‌ను సొంతం చేసుకొని స్కోరును 4–4తో సమం చేసింది. విజేతను నిర్ణయించేందుకు ‘షూట్‌ ఆఫ్‌’ నిర్వహించారు. భారత బృందం 28 పాయింట్లు స్కోరు చేయగా... చైనా 26 పాయింట్లకే పరిమితమైంది. దాంతో 2021 తర్వాత భారత మహిళల రికర్వ్‌ జట్టు ప్రపంచకప్‌లో బంగారు పతకాన్ని దక్కించుకుంది. 

చివరిసారి 2021లో దీపిక కుమారి, కోమలిక, అంకితలతో కూడిన భారత జట్టు గ్వాటెమాలా సిటీలో జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్‌–1 టోర్నీలో, పారిస్‌లో జరిగిన ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నీలో పసిడి పతకాలు గెలిచింది. మరోవైపు మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్‌ సిమ్రన్‌జీత్‌ కౌర్‌ కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. 

సెమీఫైనల్లో సిమ్రన్‌జీత్‌ 0–6 ( 25–26, 24–29, 26–28)సెట్‌ పాయింట్లతో కాంగ్‌ చెయంగ్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. అనంతరం కాంస్య పతక మ్యాచ్‌లో సిమ్రన్‌జీత్‌ 4–6 (29–27, 27–29, 28–28, 28–29, 28–28) సెట్‌ పాయింట్లతో జాంగ్‌ మిన్‌హీ (దక్షిణ కొరియా) చేతిలో పరాజయం పాలైంది. సెట్‌ గెలిస్తే రెండు పాయింట్లు, స్కోరు సమమైతే ఒక్కో పాయింట్‌ కేటాయిస్తారు. తదుపరి ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నీ టర్కిలోని అంటాల్యా నగరంలో జూన్‌ 9 నుంచి 14 వరకు జరుగుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement