India Vs Srilanka: ఫేవరెట్‌గా భారత్‌

India Vs Sri Lanka first ODI today - Sakshi

నేడు శ్రీలంకతో తొలి వన్డే

మధ్యాహ్నం 3 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

కొలంబో: భారత స్టార్‌ క్రికెటర్లతో కూడిన ఒక జట్టు ఇంగ్లండ్‌లో ఉంది. ఆ టీమ్‌ ఆట చూసేందుకు ఆగస్టు 4 వరకు ఆగాల్సిందే. కానీ ఆలోగా మరో టీమ్‌ ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లతో ఆ లోటు తీర్చేందుకు సిద్ధమైంది. భారత్, శ్రీలంక మధ్య పోరులో భాగంగా ఆదివారం తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. పేరుకు ద్వితీయ శ్రేణి జట్టుగా చెబుతున్నా, టీమిండియాలో దాదాపు అందరికీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉండగా... అటు శ్రీలంక మాత్రం కోవిడ్, కాంట్రాక్ట్‌ వివాదాలు, సీనియర్ల గైర్హాజరువంటి సమస్యలతో సతమతమవుతూ సిరీస్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అన్ని రకాలుగా భారత జట్టు ఫేవరెట్‌గా కనిపిస్తుండగా, అభిమానుల కోణంలో చూస్తే మాత్రం ఈ సిరీస్‌పై ఆసక్తి తక్కువగా ఉంది.  

అవకాశం ఎవరికి...
శ్రీలంకతో వన్డే సిరీస్‌ కోసం భారత జట్టు 20 మందితో టీమ్‌ను ప్రకటించింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌తో పాటు భువనేశ్వర్, కుల్దీప్‌ యాదవ్, చహల్, హార్దిక్‌ పాండ్యా, మనీశ్‌ పాండే సుదీర్ఘ కాలంపాటు ప్రధాన జట్టులో భాగంగా ఉంటూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు ‘వైట్‌ బాల్‌’ స్పెషలిస్ట్‌లుగా తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. వీరి అనుభవం, గత ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుంటే తుది జట్టులో చోటు ఖాయం. కాబట్టి ఇతర యువ ఆటగాళ్లలో ఎవరికి అవకాశం లభిస్తుందనేది ఆసక్తికరం. వీరందరికీ ఐపీఎల్‌ అనుభవం ఉండటం సానుకూలాంశం. రెండో ఓపెనర్‌గా పృథ్వీ షా బరిలోకి దిగుతాడు. భారత్‌ తరఫున టి20లు మాత్రమే ఆడిన సూర్యకుమార్‌కు చాన్స్‌ దక్కవచ్చు. కీపర్‌గా సామ్సన్‌కంటే ఇషాన్‌ కిషన్‌ వైపే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపుతోంది. ఇక చాలా కాలం తర్వాత మరో అవకాశం దక్కించుకున్న కుల్దీప్, చహల్‌ ద్వయం గతంలోలాగా ఏమాత్రం ప్రభావం చూపిస్తుందనేది చూడాలి. గాయం నుంచి కోలుకున్న హార్దిక్‌ పాండ్యా తన పూర్తి స్థాయి ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

కొత్త ముఖాలతో...
శ్రీలంక పరిస్థితి చూస్తే ఆ జట్టు ఒక్క మ్యాచ్‌ గెలిచినా గొప్పే అనిపిస్తోంది. దసున్‌ షనక రూపంలో గత నాలుగేళ్లలో ఆ జట్టుకు పదో కెప్టెన్‌ వచ్చాడు. కుశాల్‌ మెండిస్, డిక్‌వెలా సస్పెన్షన్‌లో ఉంటే కుశాల్‌ పెరీరా గాయంతో, మాథ్యూస్‌ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. ఇలాంటి స్థితిలో ఏమాత్రం అనుభవం లేని యువ ఆటగాళ్లపై పెను భారం పడనుంది. అవిష్క, నిసాంకా, మినోద్‌ భానుక, చమీరా, రజిత, రాజపక్సలాంటి కొత్త ఆటగాళ్లతో కూడిన ఆ టీమ్‌ భారత్‌ను నిలువరించగలదా అనేది సందేహమే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top