బోణీ ఎవరిదో? | India vs Australia first T20 today | Sakshi
Sakshi News home page

బోణీ ఎవరిదో?

Oct 29 2025 2:18 AM | Updated on Oct 29 2025 2:19 AM

India vs Australia first T20 today

నేడు భారత్, ఆస్ట్రేలియా తొలి టి20

మధ్యాహ్నం గం.1:45 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం  

కాన్‌బెర్రా: వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా... భారత జట్టు కీలక సిరీస్‌కు సిద్ధమైంది. ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ కోల్పోయిన టీమిండియా... నేటి నుంచి ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడనుంది. ఇటీవల టి20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలోని భారత జట్టు... ఆసీస్‌పై కూడా అదే జోరు కనబర్చాలని చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై భారత హిట్టర్లను అడ్డుకునేందుకు బౌన్సీ పిచ్‌లతో ఆ్రస్టేలియా సిద్ధమైంది. 

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా... రెండో ‘ప్లేస్‌’లో ఉన్న ఆ్రస్టేలియా మధ్య రసవత్తర పోరు ఖాయమే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక వేదికగా టి20 వరల్డ్‌కప్‌ జరగనుండగా... దానికి ముందు టీమిండియా మరో 15 టి20లు మాత్రమే ఆడనుంది. దీంతో మెగా టోర్నీ సన్నాహాల్లో ఈ సిరీస్‌ కీలకం కానుంది.

గతేడాది టి20 ప్రపంచకప్‌ సాధించాక టీమిండియా ఈ ఫార్మాట్‌లో కేవలం 3 మ్యాచ్‌ల్లోనే ఓడింది. బ్యాటింగ్‌ లైనప్‌ హిట్టర్లతో పటిష్టంగా ఉండగా... వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా రాకతో బౌలింగ్‌ మరింత పదును పెరిగింది. మరోవైపు ఆస్ట్రేలియా గత 20 టి20ల్లో కేవలం రెండింట్లోనే ఓడింది. మరి సమ ఉజ్జీల సమరంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి!  

కెప్టెన్‌ సూర్యపైనే దృష్టి! 
ఆసియా కప్‌లో బ్యాటర్లు దంచికొట్టడం... స్పిన్నర్లు తిప్పేయడంతో ఏమాత్రం పోటీ లేకుండానే భారత జట్టు ట్రోఫీ చేజిక్కించుకుంది. ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ పూర్తి ఆధిపత్యంతో విజయాలు సాధించింది. అయితే ఆ్రస్టేలియా పర్యటనలో మాత్రం తొలి మ్యాచ్‌ నుంచే గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఆసియా కప్‌లో పరుగుల వరద పారించిన ఓపెనర్‌ అభిషేక్‌ శర్మపై జట్టు గంపెడాశలు పెట్టుకుంది. అభిషేక్‌తో కలిసి గిల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. 

కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్, తిలక్‌ వర్మ, సంజూ సామ్సన్, రింకూ సింగ్‌తో మిడిలార్డర్‌ బలంగా ఉంది. అయితే గత కొంతకాలంగా సూర్యకుమార్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతున్నాడు.  స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా అక్షర్‌కు చోటు ఖాయం కాగా... శివమ్‌ దూబే, హర్షిత్‌ రాణాలో ఒకరికి చోటు దక్కనుంది. బుమ్రాతో కలిసి అర్ష్ దీప్ పేస్‌ బాధ్యతలు పంచుకోనుండగా.. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా వరుణ్‌ చక్ర వర్తి, కుల్దీప్‌లలో ఒకరికి చోటు దక్కనుంది. 

సమతూకంగా... 
గత వరల్డ్‌కప్‌లో భారత్‌ చేతిలో పరాజయంతో టోర్నీ నుంచి వైదొలిగిన ఆ్రస్టేలియా ఇప్పుడు సొంతగడ్డపై టీమిండియాతో పోరులో సమష్టిగా మెరిపించాలని భావిస్తోంది. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్, ట్రావిస్‌ హెడ్‌ ఆ జట్టుకు ప్రధాన బలం. ఇన్‌గ్లిస్, టిమ్‌ డేవిడ్, జోష్‌ ఫిలిప్, మిచ్‌ ఓవెన్‌తో ఆ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉంది. పేస్‌ ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ భారీ షాట్లు కొట్టడంలో సిద్ధహస్తుడు. 

ఇక బౌలింగ్‌లో హాజల్‌వుడ్‌ నుంచి టీమిండియాకు ప్రధాన ముప్పు పొంచి ఉంది. వచ్చే ఏడాది భారత్‌లో వరల్డ్‌కప్‌ జరగనున్న నేపథ్యంలో  కునేమన్‌ను పరీక్షించేందుకు ఇంతకుమించిన సమయం రాకపోవచ్చు. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌కు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలిరాగా... ఇప్పుడు టి20 సిరీస్‌ కూడా ‘హౌస్‌ ఫుల్‌’ కావడం ఖాయమే. భారీ జనసందోహం ముందు ఆడటం బాగుంటుందని మార్ష్ అన్నాడు.  

పిచ్, వాతావరణం 
బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. బౌండరీ పెద్దది కాగా... స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. బుధవారం ఇక్కడ తేలికపాటి వర్ష సూచన ఉంది. అయితే అది మ్యాచ్‌కు పెద్దగా ఆటంకం కలిగించకపోవచ్చు.  

7 ఆస్ట్రేలియా గడ్డపై ఆ్రస్టేలియాతో భారత్‌ ఇప్పటి వరకు 12 టి20లు ఆడింది. ఇందులో 7 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్‌ రద్దయింది.  

2 భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ జరగనుండటం ఇది రెండోసారి. 2023లో భారత్‌ వేదికగా జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను టీమిండియా 4–1తో గెలిచింది.  

తుది జట్లు (అంచనా) 
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్‌), అభిషేక్, గిల్, తిలక్, సామ్సన్, రింకూ సింగ్, అక్షర్, శివమ్‌ దూబే/హర్షిత్‌ రాణా, కుల్దీప్‌/వరుణ్, అర్ష్ దీప్ సింగ్, జస్‌ప్రీత్‌ బుమ్రా. 
ఆ్రస్టేలియా: మార్ష్ (కెప్టెన్‌), హెడ్, ఇన్‌గ్లిస్, టిమ్‌ డేవిడ్, ఫిలిప్, మిచ్‌ ఓవెన్, స్టొయినిస్, సీన్‌ అబాట్‌/జేవియర్, ఎలీస్, కునేమన్, హజల్‌వుడ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement