
ఆసియా కప్ 2025 రసవత్తరంగా సాగుతున్న వేళ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ఎంపిక తేదీని ప్రకటించారు. ఈ సిరీస్ కోసం భారత జట్టును సెప్టెంబర్ 23 లేదా 24 తేదీల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. జట్టు ఎంపిక ఆన్‌లైన్ మీటింగ్ ద్వారా జరుగుతుందని తెలిపారు.
విండీస్‌తో సిరీస్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి టెస్ట్ అక్టోబర్ 2–6 మధ్యలో అహ్మదాబాద్‌లో.. రెండో టెస్ట్ అక్టోబర్ 10–14 మధ్యలో ఢిల్లీలో జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కోసం విండీస్ జట్టును ఇదివరకే ప్రకటించారు.
ఎవరెవరు ఎంపికవుతారు..?
విండీస్‌తో సిరీస్‌కు ఎవరెవరు ఎంపికవుతారనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటే భారత-ఏ ఆటగాళ్లను ఈ సిరీస్ కోసం పెద్ద పీఠ వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ధృవ్ జురెల్, దేవ్‌దత్ పడిక్కల్, ఎన్ జగదీసన్ సత్తా చాటారు.
వీరితో పాటు ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ, అంతకుముందు జరిగిన బుచ్చిబాటు టోర్నీల్లో సత్తా చాటిన ఆటగాళ్ల పేర్లను కూడా పరిశీలించే అవకాశం ఉంది. సీనియర్ బౌలర్ బుమ్రాను ఈ సిరీస్ కోసం పరిగణలోకి తీసుకోకపోవచ్చు. వర్క్ లోడ్ కారణంగా అతనికి విశ్రాంతి ఇస్తారని తెలుస్తుంది.
ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన కరుణ్ నాయర్‌ను కూడా పక్కన పెడతారని సమాచారం. ఆసీస్-ఏతో సిరీస్‌కు భారత-ఏ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ పేరు కూడా పరిశీలనకు రావచ్చు. శ్రేయస్ ఇటీవల ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ కొనసాగుతాడు.
సూర్యకుమార్ సేన దూకుడు
ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాటుతూ అజేయ జట్టుగా దూసుకుపోతుంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగరవేసిన టీమిండియా.. ఇవాళ (సెప్టెంబర్ 21) గ్రూప్-4 దశలో పాకిస్తాన్‌తో తలపడనుంది.