23 ఏళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా.. అంతా వాళ్ల వల్లే! అదే జరిగితే టీమిండియా..

Ind Vs Aus 4th Test: Khawaja Steers Aus Big Total In India Since 2000 - Sakshi

India vs Australia, 4th Test: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023లో మూడో టెస్టుతో ఫామ్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియా.. నాలుగో మ్యాచ్‌లోనూ దూకుడు కొనసాగిస్తోంది.  టీమిండియాతో తొలి రెండు టెస్టుల్లో పరుగులు తీసేందుకు ఆపసోపాలు పడిన ఆసీస్‌ బ్యాటర్లు ఒక్కొక్కరుగా బ్యాట్‌ ఝులిపిస్తున్నారు. ఓవైపు ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా దంచి కొట్టగా.. ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ శతకం(114)తో మెరిశాడు.

అహ్మదాబాద్‌ టెస్టులో తొలిరోజే ఖవాజా సెంచరీ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో టీ బ్రేక్‌ సమయానికి 180 పరుగులతో అజేయంగా నిలిచాడు. 421 బంతులు ఎదుర్కొన్న అతడు 21 ఫోర్ల సాయంతో ఈ మేరకు స్కోరు సాధించాడు. అయితే, ఆ వెంటనే అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

మిగిలిన వాళ్లలో మరో ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ 32, కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ 38 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ నేపథ్యంలో ఖవాజా(180), కామెరాన్‌ గ్రీన్‌(114) అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా టీ బ్రేక్‌ సమయానికి ఆస్ట్రేలియా 146 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. 

23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
భారత గడ్డపై 2000 సంవత్సరం తర్వాత ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 400 పైచిలుకు స్కోరు చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు(తాజా మ్యాచ్‌ కలిపి) తొమ్మిది సందర్భాల్లో ఈ మేర మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల మార్కు దాటింది.

తాజా మ్యాచ్‌ మినహాయిస్తే.. ఈ మేర స్కోరు చేసిన సందర్భాల్లో ఒకసారి ఆస్ట్రేలియా విజయం సాధించగా.. 4సార్లు ఓటమిపాలైంది. మూడుసార్లు మ్యాచ్‌ డ్రా చేసుకుంది. కాగా ఇప్పటివరకు భారత బౌలర్లలో మహ్మద్‌ షమీకి రెండు, రవిచంద్రన్‌ అశ్విన్‌కు నాలుగు, రవీంద్ర జడేజాకు ఒక వికెట్‌ దక్కాయి. 

డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఆశలు
టీమిండియాతో మూడో టెస్టులో విజయంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో రోహిత్‌ సేనకు చిక్కొచ్చిపడింది. ఆఖరిదైన అహ్మదాబాద్‌ టెస్టులో  గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.

మ్యాచ్‌ ఓడినా, డ్రా అయినా.. న్యూజిలాండ్‌- శ్రీలంక సిరీస్‌ ఫలితం తేలేంత వరకు ఎదురుచూడాల్సిందే! అయితే, లంక న్యూజిలాండ్‌ గడ్డపై కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తేనే టీమిండియాతో పోటీపడే అవకాశం ఉంటుంది. అయితే, విదేశీ గడ్డపై కరుణరత్నె బృందానికి అదేమీ అంత తేలికకాదు. దీంతో టీమిండియా ఫైనల్‌ చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: IND Vs AUS: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్‌ భరత్‌కు కోహ్లి ఆదేశం!
Ind vs Aus: చెలరేగిన అశ్విన్‌.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు! సెంచరీ హీరో అవుట్‌.. ఇంకా! వీడియో వైరల్‌
Ind Vs Aus: గ్రౌండ్‌లోనే ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్‌.. సర్వెంట్‌ అనుకున్నావా! అయినా ప్రతిదానికీ..

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top