
PC: BCCI
అనధికారిక తొలి టెస్టులో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుకు భారత్-‘ఎ’ జట్టు ధీటుగా బదులిచ్చింది. ధ్రువ్ జురెల్ (Dhruv Jurel), దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal) భారీ శతకాలతో చెలరేగడంతో జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. అయితే, ఆసీస్ ఇన్నింగ్స్ కంటే ఒకే ఒక్క పరుగు వెనుకబడి ఉన్నవేళ భారత జట్టు తమ స్కోరును డిక్లేర్ చేయడం విశేషం.
లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా మంగళవారం మొదలైన తొలి టెస్టులో టాస్ ఓడిన భారత్.. తొలుత బౌలింగ్ చేసింది. అయితే, భారత బౌలర్ల వైఫల్యం కారణంగా ఆసీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
ఆసీస్ @532
ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (109), వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ (123 నాటౌట్) శతకాలతో చెలరేగగా.. మరో ఓపెనర్ కాంపెబెల్ కెల్లావే (88).. ఆల్‌రౌండర్లు కూపర్ కన్నోలి (70), లియామ్ స్కాట్ (81) అద్భుత అర్ధ శతకాలు సాధించారు.
ఈ క్రమంలో ఆసీస్ 98 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 532 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో హర్ష్ దూబే మూడు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్ బ్రార్ రెండు, ఖలీల్ అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా 141.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 531 పరుగుల వద్ద ఉన్న వేళ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
జురెల్, పడిక్కల్ భారీ శతకాలు
భారత టాపార్డర్‌లో అభిమన్యు ఈశ్వరన్ (44) ఆకట్టుకోగా.. నారాయణ్ జగదీశన్ (64), సాయి సుదర్శన్ (73) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (149)తో పాటు నాలుగో నంబర్ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ (150) భారీ శతకం సాధించాడు.
మిగతా వారిలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8) పూర్తిగా విఫలం కాగా.. తనుశ్ కొటియాన్, హర్ష్ దూబే (నాటౌట్) చెరో 16 పరుగులు చేయగలిగారు. ఆసీస్ బౌలర్లలో కారీ రాచిసిల్లీ మూడు వికెట్లు తీయగా.. కూపర్ కన్నోలి, లియామ్ స్కాట్, ఫెర్గూస్ ఒ నీల్, జేవియర్ బార్ట్‌లెట్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నాడు.
ఆసీస్‌కు స్వల్ప ఆధిక్యం.. డ్రా ఖాయమే
ఇక శుక్రవారం నాటి ఆఖరి రోజు ఆటలో తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టు 12 ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. సామ్ కొన్‌స్టాస్ 15, కాంపబెల్ కెల్లావే 18 పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత్ కంటే ఆసీస్ 39 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా ఒక సెషన్ మాత్రమే మిగిలి ఉన్నందున ఈ మ్యాచ్ డ్రా కావడం ఖాయం. ఇరుజట్ల మధ్య ఏకనా స్టేడియంలోనే సెప్టెంబరు 23- 26 వరకు రెండో అనధికారిక టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు