వన్డే సిరీస్‌: టీమిండియా ముందున్న రికార్డులు ఇవే!

Important Stats Preview And Numbers Before 1st ODI Between India And England - Sakshi

హిట్‌మ్యాన్‌ సెహ్వాగ్‌ రికార్డును అధిగమిస్తాడా!

శ్రేయస్‌ అయ్యర్‌ ముంగిట అరుదైన రికార్డు

చహల్‌ సైతం 100 వికెట్ల క్లబ్‌లో

ధావన్‌ 192 పరుగులు చేస్తే

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌, టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. సూర్యకుమార్‌ యాదవ్‌, ప్రసీద్‌ కృష్ణ వంటి కొత్త ముఖాలకు ప్రాబబుల్స్‌లో చోటుదక్కగా, పూర్తిస్థాయి జట్టుతో భారత్‌ బరిలోకి దిగనుంది. మరోవైపు, జో రూట్‌, జోఫ్రా ఆర్చర్‌, క్రిస్‌ వోక్స్‌ వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే ఇంగ్లండ్‌ టీమిండియాతో తలపడనుంది. మార్చి 23న పుణె వేదికగా ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నేపథ్యంలో, టీమిండియా- ఇంగ్లండ్‌, భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఓపెనర్లు రోహిత్‌ శర్మ- శిఖర్‌ ధావన్‌, యువ ఆటగాడు శ్రేయస్‌ అ‍య్యర్‌, బౌలర్‌ చహల్‌ తదితరుల ముందున్న రికార్డులను ఓసారి గమనిద్దాం.

ఇప్పటివరకు 100 మ్యాచ్‌లు..
భారత్‌- ఇంగ్లండ్‌ ఇప్పటి వరకు 100 వన్డేల్లో ముఖాముఖి తలపడ్డాయి. వీటిలో 53 టీమిండియా గెలవగా, ఇంగ్లిష్‌ జట్టు 42 మ్యాచ్‌లలో విజయం సాధించింది.

సొంతగడ్డపై ఇండియా రికార్డు
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన గత ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లను భారత్‌ కైవసం చేసుకుంది. కాగా 1984లో ఇంగ్లండ్‌ చేతిలో 5-1 తేడాతో ఓటమి తర్వాత ఇంతవరకు భారత జట్టుకు అలాంటి పరాభవం ఎదురుకాలేదు.

సచిన్‌ రికార్డుపై కన్నేసిన కోహ్లి
వన్డేల్లో స్వదేశంలో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో మందున్న మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ రికార్డును కోహ్లి ఈ సిరీస్‌ ద్వారా అధిగమించే అవకాశం ఉంది. సొంతగడ్డపై 164 మ్యాచ్‌లలో సచిన్‌ 20 సెంచరీలు సాధించగా, కోహ్లి ఇప్పటివరకు 95 మ్యాచ్‌లలో 19 శతకాలు సాధించాడు. ఇక టీ20 సిరీస్‌తో ఫుల్‌ఫాంలోకి వచ్చిన కోహ్లి, అదే జోరు కొనసాగిస్తే సచిన్‌ రికార్డు బద్దలవడం ఖాయం. 

స్వదేశంలో వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్లు
సచిన్‌ టెండుల్కర్‌- 20(164 మ్యాచ్‌లు)
విరాట్‌ కోహ్లి- 19(95 మ్యాచ్‌లు)
హషీం ఆమ్లా(దక్షిణాఫ్రికా)- 14(69 మ్యాచ్‌లు)
రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా)‌- 13(153 మ్యాచ్‌లు)
రాస్‌ టేలర్‌(న్యూజిలాండ్‌)-12(106 మ్యాచ్‌లు)

రికీ పాంటింగ్‌ రికార్డును అధిగమిస్తాడు..!
ఈ సిరీస్‌లో కోహ్లి గనుక సెంచరీ సాధిస్తే అంతర్జాతీయ స్థాయిలో అన్నిఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా చరిత్రకెక్కనున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌, కోహ్లి 41 శతకాలతో సమంగా ఉన్నారు.

అన్నిఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్లు
విరాట్‌ కోహ్లి: 41(197 మ్యాచ్‌లు)
రికీ పాంటింగ్‌: 41(324 మ్యాచ్‌లు)
గ్రేమ్‌ స్మిత్‌: 33(286 మ్యాచ్‌లు)
స్టీవ్‌ స్మిత్‌: 20(93 మ్యాచ్‌లు)
మైఖేల్‌ క్లార్క్‌: 19(139 మ్యాచ్‌లు)

హిట్‌మ్యాన్‌ సెహ్వాగ్‌ను దాటేనా!?
టీమిండియా ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ ఇప్పటి వరకు వన్డేల్లో 7148 పరుగులు చేశాడు. ఇక ఇంగ్లండ్‌తో జరుగనున్న సిరీస్‌లో హిట్‌మ్యాన్‌ 93 పరుగులు చేస్తే, టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌(7240) రికార్డును అధిగమిస్తాడు. అంతేగాక భారత్‌ తరఫున వన్డేల్లో మూడో అత్యంత విజయవంతమైన ఓపెనర్‌గా చరిత్రకెక్కుతాడు. ఈ జాబితాలో సచిన్‌ టెండుల్కర్‌(15310) సౌరభ్‌ గంగూలీ(9146) ముందు వరుసలో ఉన్నారు.

శ్రేయస్‌ అయ్యర్‌ ముంగిట రికార్డు
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అ‍య్యర్‌. ఇంగ్లండ్‌తో జరుగనున్న సిరీస్‌లో చోటు దక్కించుకున్న అతడిని ఓ రికార్డు ఊరిస్తోంది. అ‍య్యర్‌ ఇప్పటివరకు వన్డేల్లో 19 ఇన్నింగ్స్‌లో 807 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం, 8 అర్ధ శతకాలు ఉన్నాయి. అతడు ఈ సిరీస్‌లో 193 పరుగులు సాధించినట్లయితే, కోహ్లి, శిఖర్‌ ధావన్‌(24 ఇన్నింగ్స్‌)లను దాటి వన్డేల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కుతాడు.

100 వికెట్లకు చేరువలో చహల్‌
ఇప్పటివరకు 53 వన్డేల్లో 92 వికెట్లు తీసిన యజువేంద్ర చహల్‌, ఈ సిరీస్‌లో 8 వికెట్లు తీసినట్లయితే 100 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. ఈ ఫీట్‌ సాధించిన తొమ్మిదో భారత ఆటగాడిగా నిలుస్తాడు.

ధావన్‌ 192 పరుగులు చేస్తే
టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 136 వన్డేల్లో 5808 పరుగులు చేశాడు. ఒకవేళ ఈ సిరీస్‌లో 192 పరుగులు చేస్తే వన్డేల్లో 6000 మార్కును చేరుకున్న పదో భారత క్రికెటర్‌గా నిలుస్తాడు.

చదవండి: ఓపెనింగ్‌ జోడీ.. ఉత్కంఠకు తెరదించిన కోహ్లి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top