ILT20 2023: రూట్‌ మెరుపు ఇన్నింగ్స్‌ వృధా.. శతక్కొట్టి గెలిపించిన ప్రత్యర్ధి బ్యాటర్‌

ILT20 2023: Tom Kohler Cadmore Slams Unbeaten Ton, Warriors Win Against Capitals - Sakshi

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో వరుసగా రెండు రోజుల్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. నిన్న (జనవరి 20) అబుదాబీ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డెసర్ట్‌ వైపర్స్‌ ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ (59 బంతుల్లో 110; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ బాదగా.. ఇవాళ (జనవరి 21) దుబాయ్‌ క్యాపిటల్స్‌పై షార్జా వారియర్స్‌ ఓపెనర్‌ టామ్‌ కోహ్లెర్‌ కాడ్‌మోర్‌ (47 బంతుల్లో 106 నాటౌట్‌; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.

కాడ్‌మోర్‌ సుడిగాలి శతకంతో ఊగిపోవడంతో క్యాపిటల్స్‌ నిర్ధేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని వారియర్స్‌ కేవలం 14.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదేసింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాడ్‌మోర్‌, జో డెన్లీ (17 బంతుల్లో 29 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) వారియర్స్‌ను విజయతీరాలకు చేర్చారు. క్యాపిటల్స్‌ బౌలర్లలో అకీఫ్‌ రజా 2 వికెట్లు పడగొట్టగా.. చమిక కరుణరత్నేకు ఓ వికెట్‌ దక్కింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌ జో రూట్‌ (54 బంతుల్లో 80 నాటౌట్‌; 8 ఫోర్లు, సిక్స్‌) మెరుపు అర్ధశతకంతో, లారెన్స్‌ (38 బంతుల్లో 34; 2 ఫోర్లు, సిక్స్‌), రోవమన్‌ పావెల్‌ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. వారియర్స్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌, నవీన్‌ ఉల్‌ హాక్‌ తలో 2 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో టామ్‌ కోహ్లెర్‌ కాడ్‌మోర్‌ బాదిన శతకం రెండోది కాగా, అంతకుముందు మ్యాచ్‌లో అలెక్స్‌ హేల్స్‌ చేసినది లీగ్‌లో తొట్టతొలి సెంచరీ కావడం విశేషం. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top