టీ20 వరల్డ్‌కప్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌ అతడే..! | Ian Bishop's Prediction For T20 World Cup 2024 | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌కప్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌ అతడే..!

Published Thu, May 30 2024 9:10 AM

Ian Bishop's Prediction For T20 World Cup 2024

మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్‌ 2024పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. పలానా ఆటగాడు ఇన్ని పరుగులు చేస్తాడు.. పలానా బౌలర్‌ అన్ని వికెట్లు తీస్తాడు.. పలానా జట్టు టైటిల్‌ గెలుస్తుంది.. పలానా జట్లు సెమీస్‌కు చేరతాయని అభిమానులు, విశ్లేషకులు సోషల్‌మీడియా వేదికగా జోస్యాల మోత మోగిస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా విండీస్‌ దిగ్గజ బౌలర్‌, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్‌ బిషప్‌ కూడా స్పందించాడు.

బిషప్‌ అందరి అంచనాలకు భిన్నంగా తన ప్రెడిక్షన్‌కు చెప్పి క్రికెట్‌ సర్కిల్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈసారి వరల్డ్‌కప్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా టీమిండియా చైనా మెన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఉంటాడని బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ చేశాడు. మరో టీమిండియా బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అత్యంత ప్రభావిత బౌలర్‌గా ఉంటాడని అభిప్రాయపడ్డాడు. విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్లేషకులు, మాజీలు యుజ్వేంద్ర చహల్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌ అవుతాడని ముక్తకంఠంతో వాదిస్తుంటే.. బిషప్‌ మాత్రం కుల్దీప్‌ పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

వరల్డ్‌కప్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌పై కూడా బిషప్‌ తన అంచనాను అందరికీ భిన్నంగా వెల్లడించాడు. ఈ విభాగంలో మెజారిటీ శాతం విరాట్‌, రోహిత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, బాబర్‌ ఆజమ్‌ల పేర్లు చెబుతుంటే బిషప్‌ మాత్రం ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ పేరు చెప్పి అందరి అంచనాల్లో తన అంచనా వేరని నిరూపించాడు. సెమీఫైనలిస్ట్‌ల విషయంలోనూ బిషప్‌ అంచనా కాస్త వైవిధ్యంగా ఉంది. ఈసారి ఫైనల్‌ ఫోర్‌కు భారత్‌, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లు చేరతాయని బిషప్‌ చెప్పుకొచ్చాడు.

కాగా, టీ20 వరల్డ్‌కప్‌ 2024 ఎడిషన్‌ జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ భారత్‌ ప్రస్తానం జూన్‌ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. అనంతరం టీమిండియా జూన్‌ 9న చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో తలపడుతుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ కోసం ఇదివరకే న్యూయార్క్‌ చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో నిమగ్నమై ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement