పద్దెమినిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. గతేడాది తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). డిఫెండింగ్ చాంపియన్‌గా భారీ అంచనాలతో ఐపీఎల్-2026లో బరిలోకి దిగి.. మరోసారి టైటిల్ సాధించి సత్తా చాటింది.
అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది. తద్వారా రజత్ పాటిదార్ సారథ్యంలో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి.. అభిమానులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.
ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పూసర్ల వెంకట సింధు (PV Sindhu) ఆర్సీబీకి శుభాకాంక్షలు చెప్పిన తీరు వైరల్‌గా మారింది. తాను బెంగళూరుకు మకాం మార్చిన తర్వాత.. అకస్మాత్తుగా ఆర్సీబీ ట్రోఫీల మీద ట్రోఫీలు గెలుస్తోందని సరదాగా ఆమె కామెంట్ చేశారు.
నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు!
‘‘ఆర్సీబీ అభిమానులారా!... నేనేమీ మీ లక్కీ చార్మ్ అని చెప్పడం లేదు. కానీ.. మీరొకటి గమనించారా.. నేను బెంగళూరుకు మకాం మార్చినప్పటి నుంచి అకస్మాత్తుగా మీరు వరుసగా ట్రోఫీలు సాధిస్తున్నారు. అవునో.. కాదో మీరే లెక్కలు కట్టేయండి.
ఏదేమైనా ఆర్సీబీ ఒక అసామాన్యమైన జట్టు. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది.. అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా జట్టును తమ సొంతంగా భావించే అభిమానులకు కంగ్రాట్స్. ఈ ఫ్రాంఛైజీ భావోద్వేగాలకు నిలయం.
అత్యంత ప్రత్యేకం
ఆర్సీబీ అంటే ఫ్యాన్స్‌కు ఒక రకంగా పిచ్చి. ఎన్నో ఏళ్లుగా ట్రోఫీ గెలుస్తామనే నమ్మకంతో వారు జట్టుకు అండగా నిలిచారు. ఇప్పుడిలా వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలవడం నిజంగా అత్యంత ప్రత్యేకం’’ అని పీవీ సింధు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆర్సీబీకి శుభాకాంక్షలు తెలిపారు.
అయితే, ఫైనల్లో చాలా మంది మాదిరే తానూ ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ పోరును చూడాలనుకున్నానన్న సింధు.. బెంగళూరు ఈ విజయానికి వందశాతం అర్హమైందని పేర్కొన్నారు.
కాగా ఐపీఎల్‌లో వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) సరసన రజత్ పాటిదార్ నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


