మీరంటే నేను.. నేనంటే మీరు: గంభీర్‌ భావోద్వేగం | 'I'm You Kolkata': Gambhir's Heartfelt Message To KKR Fans Before Joining Team India | Sakshi
Sakshi News home page

మీరంటే నేను.. నేనంటే మీరు: గంభీర్‌ భావోద్వేగం

Jul 17 2024 11:36 AM | Updated on Jul 17 2024 12:05 PM

'I'm You Kolkata': Gambhir's Heartfelt Message To KKR Fans Before Joining Team India

‘‘మీరు నవ్వితే నేనూ నవ్వుతాను. మీరు కంటతడి పెడితే.. నా కళ్లూ చెమర్చుతాయి. మీరు గెలిస్తే నేను గెలిచినట్లే.

మీరు ఓడితే నేనూ ఓడినట్లే. మీ కలలే నా కలలూ.. మీరు ఏదైనా సాధిస్తే.. నేనూ సాధించినట్లే. మీరంటే నేను.. నేనంటే మీరు.

మనమంతా కోల్‌కతా. కేవలం మీకోసమే నేను. కానీ ఇప్పుడు మీ మనసు భావోద్వేగాలతో నిండిపోయిందని తెలుసు. నా పరిస్థితి కూడా అదే.

మీరు నన్ను ఆగిపొమ్మని డిమాండ్‌ చేస్తున్నారు. అయినా, మన మధ్య అనుబంధం చెక్కు చెదరనిది. మనమంతా ఇప్పటికే చరిత్ర సృష్టించాం.

మనదంతా ఒక జట్టు. అయితే, సరికొత్త అధ్యాయానికి నాంది పలికే సమయం ఆసన్నమైంది. ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు మనం సిద్ధమవుదాం.

అయితే, ఆ చరిత్ర ఈసారి పర్పుల్‌ కలర్‌ జెర్సీతో కాకుండా.. నీలం రంగు జెర్సీతో సృష్టించబోతున్నాం. టీమిండియా కోసం పనిచేద్దాం.

ఈ ప్రయాణంలోనూ నాకు మీ తోడు కావాలి. మీ మద్దతు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. తిరంగా రెపరెపలాడేందుకు మీరు నాతో కలిసి అడుగేయాలి. మన దేశం కోసం మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగుదాం’’ అంటూ టీమిండియా కొత్త హెడ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ ఉద్వేగానికి లోనయ్యాడు.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశాడు. కేకేఆర్‌ మెంటార్‌గా తనను ఆదరించినందుకు సంతోషంగా ఉందని.. టీమిండియా కోచ్‌గానూ ఇదే రకంగా మద్దతునివ్వాలని కోరాడు.

2022లో మెంటార్‌గా ఐపీఎల్‌లో రీఎంట్రీ
కాగా భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ఐపీఎల్‌లో కోల్‌కతా జట్టు కెప్టెన్‌గా పనిచేశాడు. 2012, 2014 సీజన్లలో టైటిల్‌ అందించాడు. అనంతరం ఫ్రాంఛైజీతో విభేదాలు తలెత్తగా ఢిల్లీ జట్టుకు మారిన గంభీర్‌.. అక్కడా అభిప్రాయ భేదాలు రావడంతో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు.

అనంతరం కామెంటేటర్‌గా కొనసాగిన గౌతీ.. 2022లో మెంటార్‌గా ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. రెండేళ్ల పాటు లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేసిన అతడు.. ఈ ఏడాది సొంతగూటికి చేరుకున్నాడు.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌లో మెంటార్‌గా రీఎంట్రీ ఇచ్చిన గంభీర్‌ జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. పదేళ్ల తర్వాత కేకేఆర్‌ ట్రోఫీ సాధించేందుకు దోహదం చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి దృష్టిని ఆకర్షించిన గౌతీ.. టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.

శ్రీలంక సిరీస్‌తో ప్రయాణం మొదలు
ఈ క్రమంలో జూలై 27న శ్రీలంకతో మొదలుకానున్న ద్వైపాక్షిక సిరీస్‌ ద్వారా గంభీర్‌ తన ప్రస్థానం మొదలుపెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ అభిమానులకు భావోద్వేగ వీడ్కోలు పలుకుతూ వీడియో విడుదల చేశాడు. టీమిండియా కోచ్‌గా తనకు పూర్తి అండగా నిలవాలంటూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు.

చదవండి: అభిమానులకు గుడ్‌న్యూస్‌.. షమీ బౌలింగ్‌ ప్రాక్టీస్‌ షురూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement