రాణించిన రాహుల్ రాధేశ్
పుదుచ్చేరి తొలి ఇన్నింగ్స్ 25/1
పుదుచ్చేరి: దేశవాళీ ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీరంజీ ట్రోఫీ రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు మెరుగైన స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 255/1తో ఆదివారం రెండో రోజు బరిలోకి దిగిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో చివరకు 134.5 ఓవర్లలో 435 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ రాహుల్ రాధేశ్ (161 బంతుల్లో 81; 10 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
రోహిత్ రాయుడు (79 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. కెప్టెన్ రాహుల్ సింగ్ (175 బంతుల్లో 114; 12 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరు వద్దే వెనుదిరగగా... హిమతేజ (159 బంతుల్లో 66; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి పెవిలియన్ చేరాడు. వేణు గౌడ్ (0) విఫలమయ్యాడు. ఈ దశలో రోహిత్ రాయుడుతో కలిసి రాహుల్ రాధేశ్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
రాయుడు అవుటైనా... తక్కినవాళ్లతో కలిసి రాహుల్ రాజేశ్ కీలక పరుగులు జోడించి ఆఖరి వికెట్ రూపంలో వెనుదిగాడు. పుదుచ్చేరి బౌలర్లలో సాగర్ 4 వికెట్లు నేలకూల్చగా... జయంత్ యాదవ్, కరణ్ కన్నన్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాండిచ్చేరి ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది.
పారస్ (5 బ్యాటింగ్) అవుట్ కాగా... గంగ శ్రీధర్ రాజు (6 బ్యాటింగ్), ఆనంద్ బియాస్ (14 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ బౌలర్లలో పున్నయ్య ఒక వికెట్ పడగొట్టాడు. చేతిలో 9 వికెట్లు ఉన్న పాండిచ్చేరి... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 410 పరుగులువెనుకడి ఉంది.
తడబడ్డ ఆంధ్ర
ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా విజయనగరం వేదికగా బరోడాతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తడబడింది. తొలుత ప్రత్యర్థికి మంచి స్కోరు చేసే అవకాశం ఇచి్చన ఆంధ్ర... ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ధాడిగా ఆరంభించేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఓవర్‌నైట్ స్కోరు 230/6తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బరోడా 109 ఓవర్లలో 363 పరుగులకు ఆలౌటైంది.
క్రితం రోజు సెంచరీకి ఒక పరుగు దూరంలో నిలిచిన విష్ణు సోలంకి (131; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకం పూర్తి చేసుకోగా... కెప్టెన్ అతీత్ సేథ్ (148 బంతుల్లో 86; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), మహేశ్ (82 బంతుల్లో 54; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీలు చేశారు. ఆంధ్ర బౌలర్లలో అరంగేట్ర పేసర్ కావూరి సాయితేజ 4 వికెట్లు పడగొట్టగా... త్రిపురాణ విజయ్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. ఓపెనర్లు శ్రీకర్ భరత్ (8), అభిషేక్ రెడ్డి (15) అవుట్ కాగా... కెప్టెన్ రికీ భుయ్ (7 బ్యాటింగ్), షేక్ రషీద్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 320 పరుగులు వెనుకబడి ఉంది.


