‘అతడు ప్లే ఆఫ్స్‌లో ఫెయిల్‌ అవుతూనే ఉన్నాడు’ | Huge Failure In Playoffs: Kriss Srikanth Lambasted India Star Poor Show Eliminator | Sakshi
Sakshi News home page

అతడు ప్లే ఆఫ్స్‌లో ఫెయిల్‌ అవుతూనే ఉన్నాడు: మాజీ కెప్టెన్‌ ఫైర్‌

May 29 2026 8:53 AM | Updated on May 29 2026 9:16 AM

Huge Failure In Playoffs: Kriss Srikanth Lambasted India Star Poor Show Eliminator

అభిషేక్‌ శర్మ (PC: BCCI/IPL)

ఐపీఎల్‌-2026లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అసలు సమరంలో మాత్రం చేతులెత్తేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సమిష్టి వైఫల్యంతో ఇంతటితో ప్రయాణం ముగించింది. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన సన్‌రైజర్స్‌ టాపార్డర్‌ రాజస్తాన్‌ బౌలింగ్‌ ధాటికి కుదేలు కావడం తీవ్ర ప్రభావం చూపింది.

టాపార్డర్‌ కుదేలు
ఓపెనర్లలో అభిషేక్‌ శర్మ డకౌట్‌ కాగా.. ట్రవిస్‌ హెడ్‌ (8 బంతుల్లో 17) కాసేపు వేగంగా ఆడినా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. ఇక వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (11 బంతుల్లో 33) మెరుపులు కూడా ఎక్కువసేపు కొనసాగలేదు. ఈ ముగ్గురిని రాజస్తాన్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ పెవిలియన్‌కు చేర్చాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ అభిషేక్‌ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్లే ఆఫ్స్‌లో ఎల్లప్పుడూ అతడు విఫలం అవుతున్నాడని.. ఇంతకంటే చెత్త విషయం మరొకటి ఉండదన్నాడు. స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ..

అతడు ప్లే ఆఫ్స్‌లో ఫెయిల్‌ అవుతూనే ఉన్నాడు
‘‘2024 నుంచి సన్‌రైజర్స్‌కు ఇదే సమస్య. అభిషేక్‌ శర్మ ప్లే ఆఫ్స్‌లో ప్రతిసారీ విఫలమవుతూనే ఉన్నాడు. ఆర్చర్‌ ఈసారి పవర్‌ప్లేలో అతడితో పాటు ఇషాన్‌ కిషన్‌నూ వెనక్కి పంపి దెబ్బకొట్టాడు. ట్రవిస్‌ హెడ్‌ అయితే గుడ్డిగా ఆడుతూ పోయాడే తప్ప ప్లాన్‌ ఉన్నట్లు కనిపించలేదు.

ఇక హెన్రిచ్‌ క్లాసెన్‌ కంటే ముందు స్మరణ్‌ రవిచంద్రన్‌ ఎందుకు బ్యాటింగ్‌కు వచ్చాడో తెలియదు. అభిషేక్‌ శర్మ అవుటైనా ఇషాన్‌ వేగంగా ఆడాడు. మూడు ఓవర్లలోనే దాదాపుగా 50 పరుగులు తెచ్చారు. అయితే, ఇషాన్‌ అవుటైన తర్వాత సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది.

రాయల్స్‌ను గెలిపించిన వైభవ్‌
ఏదేమైనా ప్లే ఆఫ్స్‌లో అభిషేక్‌ శర్మ విఫలం కావడం సన్‌రైజర్స్‌కు అతిపెద్ద సమస్యగా మారింది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ పేర్కొన్నాడు. కాగా ముల్లన్‌పూర్‌ వేదికగా బుధవారం నాటి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 243 పరుగులు సాధించింది.

ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (29 బంతుల్లో 97) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడ్డ సన్‌రైజర్స్‌ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

చదవండి: ‘జైస్వాల్‌ రాయల్స్‌ను విడిచి వెళ్లాలి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement