రూ. 28 కోట్లు దండగేనా? చీప్‌గా దొరికాడు.. చితక్కొడుతున్నాడు! | How Sarfaraz Khan Is Outperforming CSKs 28-Crore Duo | Sakshi
Sakshi News home page

IPL 2026: రూ. 28 కోట్లు దండగేనా? చీప్‌గా దొరికాడు.. చితక్కొడుతున్నాడు!

Apr 6 2026 5:08 PM | Updated on Apr 6 2026 6:00 PM

How Sarfaraz Khan Is Outperforming CSKs 28-Crore Duo

ఐపీఎల్‌-2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట తీరు ఏ మాత్రం మార‌లేదు. ఈ ఏడాది సీజ‌న్‌లో సీఎస్‌కే హ్యాట్రిక్ ఓట‌ముల‌ను మూట క‌ట్టుకుంది. ఆదివారం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో 43 ప‌రుగుల తేడాతో చెన్నై ప‌రాజ‌యం పాలైంది. 

అయితే రుతురాజ్ గైక్వాడ్‌, సంజూ శాంస‌న్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు విఫ‌ల‌మ‌వుతున్న‌ చోట ఒక్క‌డు మాత్రం స‌త్తా చాటుతున్నాడు. అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో సీఎస్‌కే మేనెజ్‌మెంట్ త‌నపై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నాడు. రెడ్ బాల్ క్రికెట్‌లోనూ కాదు టీ20ల్లో కూడా రాణించే సత్తా ఉంద‌ని నిరూపించుకుంటున్నాడు. అత‌డే ముంబై మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ సర్ఫ‌రాజ్ ఖాన్‌.

ధర తక్కువ.. క్వాలిటీ ఎక్కువ
గతేడాది జరిగిన ఐపీఎల్‌ మినీ వేలంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ను కేవలం రూ.75 లక్షలకు మాత్రమే సీఎస్‌కే కొనుగోలు చేసింది. కానీ కోట్ల ధర పలికిన సంజూ శాంసన్‌, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ కంటే సర్ఫరాజ్ అద్భుతమైన ప్రదర్శనమైన కనబరుస్తున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అనుహ్యంగా ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌.. 17 ప‌రుగులు చేసి ఫ‌ర్వాలేద‌న్పించాడు. 

ఆ త‌ర్వాత పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేవ‌లం 12 బంతుల్లోనే 32 ప‌రుగులు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్యపరిచాడు. ఆదివారం ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో కూడా స‌ర్ఫ‌రాజ్ బ్యాట్ ఝులిపించాడు. కేవలం 25 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 పరుగులు చేశాడు. 

శాంసన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, అయూశ్‌ మాత్రే సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే ఔట్‌ అయితే.. ఈ ముంబైకర్‌ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సర్ఫరాజ్ ప్రస్తుతం 99 పరుగులతో సీఎస్‌కే లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. వేలంలో ఇతడిని వదిలేసిన జట్లు ఇప్పుడు ఖచ్చితంగా పశ్చాత్తాపపడుతుంటాయి.

28 కోట్ల ఆటగాళ్లు విఫలం
కాగా ఐపీఎల్‌-2026 మినీ వేలంలో సీఎస్‌కే ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై భారీ మొత్తం ఖర్చుచేసిన సంగతి తెలిసిందే.కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లను తలా రూ.14.20 కోట్లు వెచ్చించి సీఎస్‌కే కొనుగోలు చేసింది. కానీ భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన వీరిద్దరూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌లో భారీ హిట్టర్‌గా పేరొందిన కార్తీక్ శర్మ.. ఐపీఎల్‌లో మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. 

ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. దేశవాళీ ఫామ్‌ను చూసి స్కౌటింగ్ టీమ్ అతడిపై అతిగా అంచనా వేసిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జడేజాకు ప్రత్యామ్నయంగా ప్రశాంత్ వీర్‌ను సీఎస్‌ఎకే జట్టులోకి తీసుకుంది. 

అయితే అతడితో ఇప్పటివరకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం  ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండు మ్యాచ్‌లు ఆడి 49 పరుగులు చేశాడు. ఆదివారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ప్రశాంత్ వీర్ 29 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 రన్స్ చేసి రాణించాడు. కానీ అతడు తీసుకుంటున్న జీతానికి ఇది ఏ మాత్రం సరిపోదు.
చదవండి: CSKకు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు!

Advertisement
 
Advertisement
Advertisement