జూన్ 3 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (జూన్ 1) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా షాయ్ హోప్ కొనసాగనుండగా.. పలువురు కీలక ఆటగాళ్లు చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చారు.
రీఎంట్రీల్లో ఎక్కువ ఆకర్శిస్తున్న పేరు షిమ్రోన్ హెట్‌మైర్‌ది. ఇతను గతేడాది జూన్ తర్వాత ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయినా లంక సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించినందుకు అతడికి ఈ ఆఫర్ వచ్చింది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ దృష్ట్యా ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది.
అలాగే గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న అల్జరీ జోసఫ్, గుడకేశ్ మోటీ కూడా ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. వర్క్‌లోడ్ విషయం పరిగణలోకి వచ్చినా జేడన్ సీల్స్, షమార్ జోసఫ్‌ను ఎంపిక చేశారు. 2027 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే విండీస్‌కు ఈ సిరీస్ చాలా ముఖ్యం. అందుకే బలమైన జట్టుతో బరిలోకి దిగుతుంది. ఇటీవల విండీస్ జట్టుకు స్వదేశంలో తిరుగులేని రికార్డు ఉంది. వరుసగా ఐదు వన్డే సిరీస్‌లు గెలిచి అజేయ జట్టుగా చలామణి అవుతుంది.
స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌కు వెస్టిండీస్ వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), అకీమ్ ఆగస్టే, జాన్ క్యాంప్‌బెల్, కీసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, షిమ్రోన్ హెట్‌మైర్, అమీర్ జాంగూ, అల్జరీ జోసెఫ్, షమార్ జోసఫ్, గుడకేశ్ మోటీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, జేడన్ సీల్స్, షమార్ స్ప్రింగర్
విండీస్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూల్
జూన్ 3- తొలి వన్డే (కింగస్టన్)
జూన్ 6- రెండో వన్డే (కింగస్టన్)
జూన్ 8- మూడో వన్డే (కింగ్‌స్టన్)
ఇదిలా ఉంటే, ఈ విండీస్ పర్యటనలో శ్రీలంక జట్టు వన్డే సిరీస్ తర్వాత 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్ట్ ఆడనుంది. జూన్ 11, 13, 14 తేదీల్లో ఇదే కింగస్టన్ వేదికగా మూడు టీ20లు జరుగనున్నాయి.
అనంతరం శ్రీలంక జట్టు విండీస్ సెలెక్ట్ టీమ్‌తో ఓ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ (జూన్ 18-21) ఆడుతుంది. దీని తర్వాత జూన్ 25 నుంచి ఆంటిగ్వాలో తొలి టెస్ట్, జులై 3 నుంచి అదే అంటిగ్వాలో రెండో టెస్ట్ జరుగనున్నాయి.


