ఐపీఎల్ 2026లో ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మరో అరుదైన ఘనత సాధించాడు. నిన్న (మే 22) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ద సెంచరీ (24 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) బాదిన అతడు.. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ విదేశీ ఆటగాడు సాధించలేని రికార్డును సొంతం చేసుకున్నాడు. ఓ ఐపీఎల్ సీజన్‌లో లీగ్ దశలోని 14 మ్యాచ్‌ల్లో డబుల్ డిజిట్ స్కోర్లు నమోదు చేసిన తొలి విదేశీ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఈ సీజన్‌లో అసాధారణ ఫామ్‌లో ఉన్న క్లాసెన్.. వరుసగా 31, 52, 62, 39, 40, 59, 37, 29, 65, 11, 69, 14, 47, 51 స్కోర్లు చేశాడు. ఇందులో 6 అర్ద సెంచరీలు ఉన్నాయి. క్లాసెన్ ఈ 14 మ్యాచ్‌ల్లో 159.47 స్ట్రయిక్‌రేట్‌తో 606 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో సాయి సుదర్శన్ (638), శుభ్‌మన్ గిల్ (616) తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ ఇన్నింగ్స్‌తో క్లాసెన్ మరో ప్రత్యేక రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో నాలుగో స్థానంలో లేదా అంతకంటే దిగువ బ్యాటింగ్ చేస్తూ ఒకే టోర్నీలో 600కుపైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. 2018 ఐపీఎల్ ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రిషభ్ పంత్ 684 పరుగులు చేసి తొలిసారి ఈ ఘనత సాధించాడు. తాజాగా క్లాసెన్ ఈ అరుదైన జాబితాలో పంత్ సరసన చేరాడు.
ఈ ఇన్నింగ్స్‌తో క్లాసెన్ మరో మైలురాయిని కూడా తాకాడు. 31 పరుగుల వద్ద అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ ముందున్నారు.
ఆర్సీబీ మ్యాచ్‌లో క్లాసెన్‌తో పాటు అభిషేక్ శర్మ (56), ట్రవిస్ హెడ్ (26), ఇషాన్ కిషన్ (79), నితీశ్ కుమార్ రెడ్డి (29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం భారీ లక్ష్యఛేదనను ఆర్సీబీ కూడా ఘనంగానే ప్రారంభించినా.. ఆతర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆదిలో వెంకటేష్ అయ్యర్ (44) మెరుపులు మెరిపించగా.. కోహ్లి (15) విఫలమయ్యాడు.
ఆతర్వాత వచ్చిన పడిక్కల్ (21), రజత్ పాటిదార్ (56), కృనాల్ పాండ్యా (41 నాటౌట్), టిమ్ డేవిడ్ (15 నాటౌట్) పర్వాలేదనిపించినప్పటికీ.. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 200 పరుగులకే పరిమితమై, 55 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.


