అతడికి నా పేరు కూడా తెలుసు: ఆర్సీబీ క్వీన్‌ పోస్ట్‌ వైరల్‌ | He Actually Knows My Name: Shreyanka Patil On Kohli Million Dollar Remark Viral | Sakshi
Sakshi News home page

Virat Kohli: అతడికి నా పేరు కూడా తెలుసు: ఆర్సీబీ క్వీన్‌ పోస్ట్‌ వైరల్‌

Mar 21 2024 3:24 PM | Updated on Mar 21 2024 3:46 PM

He Actually Knows My Name: Shreyanka Patil On Kohli Million Dollar Remark Viral - Sakshi

భారత మహిళా క్రికెటర్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ శ్రేయాంక పాటిల్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇంతకంటే ఇంకేం కావాలి అన్నట్లు గాల్లోతేలిపోయే అనుభూతిని ఆస్వాదిస్తోంది. తన రోల్‌ మోడల్‌ను నేరుగా కలవడమే గాకుండా.. అతడితో ప్రశంసలు అందుకోవడమే ఇందుకు కారణం. 

ఐపీఎల్‌ తర్వాత బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీ20 టోర్నీ వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చిన బెంగళూరు అమ్మాయి శ్రేయాంక. దేశవాళీ క్రికెట్‌లో సొంత రాష్ట్రం కర్ణాటకకు ఆడుతున్న 21 ఏళ్ల ఈ ఆఫ్‌ స్పిన్‌ బౌలర్‌ గతేడాది భారత జట్టు తరఫున అరంగేట్రం చేసింది.

గతేడాది ఆరంభమైన వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆర్సీబీకి ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. రూ. 10 లక్షలకు తనను కొనుక్కున్న ఆర్సీబీకి తాజా ఎడిషన్‌లో పైసా వసూల్‌ ప్రదర్శన ఇచ్చింది. ముఖ్యంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో కీలక సమయంలో నాలుగు వికెట్లు తీసింది.

తద్వారా డబ్ల్యూపీఎల్‌-2024లో ఆర్సీబీ చాంపియన్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంటోంది. ఇక సీజన్‌లో మొత్తంగా 9 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు తీసిన శ్రేయాంక పర్పుల్‌ క్యాప్‌(అత్యధిక వికెట్లు) విజేతగా నిలిచింది.

అంతేకాదు ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అవార్డునూ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. మార్చి 22న ఐపీఎల్‌-2024 ఆరంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ అన్‌బాక్స్‌ ఈవెంట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రోఫీ గెలిచిన మహిళా జట్టును ఆర్సీబీ పురుష జట్టు గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌తో సముచితంగా గౌరవించింది.

ఇక ఈ ఈవెంట్‌లో పేరు, లోగో మార్పులతో కొత్త జెర్సీని రివీల్‌ చేసింది ఆర్సీబీ. ఈ కార్యక్రమంలో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని కలిసే అవకాశం వచ్చింది శ్రేయాంకకు! ఈ నేపథ్యంలో కింగ్‌ కోహ్లితో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ఉద్వేగానికి లోనైందామె.

‘‘అతడి వల్లే క్రికెట్‌ చూడటం అలవాటు చేసుకున్నా. అతడిలాగే క్రికెటర్‌ కావాలని కలలు కంటూ పెరిగాను. ఎట్టకేలకు.. జీవితకాలానికి సరిపడా సంతోషాన్నిచ్చే క్షణం నిన్న రాత్రి చోటుచేసుకుంది. 

‘హాయ్‌.. శ్రేయాంక.. అద్భుతంగా బౌల్‌ చేశావు’ అని విరాట్‌ నాతో అన్నాడు. అతడికి నా పేరు కూడా తెలుసు’’ అంటూ రోల్‌మోడల్‌తో కలిసి ఫ్యాన్‌గర్ల్‌ మూమెంట్‌ను ఆస్వాదించినట్లు శ్రేయాంక పాటిల్‌ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టగా వైరల్‌గా మారింది.

చదవండి: Sachin Tendulkar: నేను 22 ఏళ్లు ఎదురుచూశా.. నువ్వు ఆ మాత్రం వెయిట్‌ చేయలేవా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement