హార్దిక్‌ పాండ్యా సంచలన నిర్ణయం | Hardik Pandya Follows Arshdeep Singh Footsteps, Removes His Entire Digital Trace | Sakshi
Sakshi News home page

హార్దిక్‌ పాండ్యా సంచలన నిర్ణయం

May 27 2026 8:21 PM | Updated on May 27 2026 8:24 PM

Hardik Pandya Follows Arshdeep Singh Footsteps, Removes His Entire Digital Trace

ఐపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్‌ దారుణ ప్రదర్శన తర్వాత ఆ జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాంచైజీ అభిమానుల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను (@hardikpandya93) డీయాక్టివేట్‌ చేసుకున్నాడు.

ఈ చర్యతో అభిమానుల్లో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవల అతడు తన ఇన్‌స్టా స్టోరీలో "07:07" అని పోస్ట్‌ చేశాడు. ఇది అతని ఫోన్‌ లాక్‌స్క్రీన్‌లో కనిపించిన టైమ్‌. దీన్ని చూసి అభిమానులు ఎంఎస్‌ ధోనితో లింక్‌ చేస్తూ.. హార్దిక్‌ సీఎస్‌కేకు మారనున్నాడన్న అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఇన్‌స్టా ఖాతా డీయాక్టివేట్‌ కావడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది.

ధోని జెర్సీ నంబర్‌ 7, జన్మదినం జూలై 7 (7/7) కావడంతో.. హార్దిక్‌ వచ్చే సీజన్‌లో సీఎస్‌కేలో చేరబోతున్నాడన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తలపై హార్దిక్‌, ముంబై ఇండియన్స్‌ లేదా సీఎస్‌కే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

హార్దిక్‌ విషయంలో ఇలా జరగడం ఈ సీజన్‌లో ఇది మొదటిసారి కాదు. మే 11న కూడా అతడి సోషల్‌మీడియా యాక్టివిటీ పెద్ద వివాదానికే దారి తీసింది. అప్పట్లో అతడు ముంబై ఇండియన్స్‌కు సంబంధించిన కొన్ని పోస్టులను తొలగించాడని, జట్టును అన్‌ఫాలో చేశాడని వార్తలు వచ్చాయి. 

కొందరు అభిమానులు అయితే హార్దిక్‌ తన సహచర ఆటగాళ్లను కూడా అన్‌ఫాలో చేశాడని పేర్కొన్నారు. దీంతో హార్దిక్‌ అప్పుడే ముంబై ఇండియన్స్‌ నుంచి తప్పుకుంటున్నాడన్న ప్రచారం జరిగింది.

అయితే కొద్ది సేపటికే పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో అది సోషల్‌మీడియా గ్లిచ్ అని అందరూ సర్దుకున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే రావడంతో ఏదో జరుగుతుందన్న అనుమానాలు ఊపందుకున్నాయి.

ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్‌ దారుణ ప్రదర్శనలు చేసి, ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే (9వ స్థానం) నిష్క్రమించింది. హార్దిక్‌ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగతంగానూ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతడిపై సొంత ఫ్రాంచైజీ అభిమానులే భారీ ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. జట్టు నుంచి, కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement