ధోని గురించి ప్రశ్న.. రుతురాజ్‌ వ్యాఖ్యలు వైరల్‌ | Ruturaj Breaks Silence On Will MS Dhoni Play 2027 Amid Retirement Rumours Viral, Says Happy With The Guys We Had | Sakshi
Sakshi News home page

ధోని గురించి ప్రశ్న.. నాకేం తెలుసు?: రుతురాజ్‌

May 22 2026 10:45 AM | Updated on May 22 2026 1:53 PM

Happy with Guys We had: Ruturaj Breaks Silence on Will MS Dhoni Play 2027

రుతురాజ్‌ గైక్వాడ్‌ (PC: BCCI/IPL)

ఐదుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2026లో చెత్త ప్రదర్శన కనబరిచింది. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా గురువారం గుజరాత్‌ టైటాన్స్‌ను ఎదుర్కొన్న చెన్నై.. ఘోర ఓటమిపాలైంది. ఫలితంగా ప్లే ఆఫ్స్‌ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

89 పరుగుల తేడాతో చిత్తు
గుజరాత్‌తో మ్యాచ్‌లో సమిష్టి వైఫల్యంతో 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. చెన్నై జట్టు ప్లే ఆఫ్స్‌ చేరకుండా ఇంటిబాటపట్టడం వరుసగా ఇది మూడోసారి. ఇదిలా ఉంటే.. చెన్నైని ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన దిగ్గజ సారథి మహేంద్ర సింగ్‌ ధోని ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.

రిటైర్మెంట్‌ సంకేతాలు
మోకాలి నొప్పి కారణంగా ధోని (MS Dhoni) ఆరంభ మ్యాచ్‌లకు దూరమవుతాడని చెన్నై యాజమాన్యం తొలుత ప్రకటించింది. అయితే, ఆ తర్వాత కూడా అతడు అందుబాటులోకి రాలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో చెన్నై సొంతమైదానం చెపాక్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ సందర్భంగా సోమవారం ధోని దర్శనమిచ్చాడు.

సహచర ఆటగాళ్లతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగిన ధోని.. అభిమానులకు అభివాదం చేస్తూ మైదానం మొత్తం కలియదిరిగాడు. దీంతో ‘తలా’ రిటైర్మెంట్‌ ఇచ్చాడనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ధోని నోటి నుంచి అధికారికంగా ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనా రాలేదు.

ఈ నేపథ్యంలో 44 ఏళ్ల ధోని వచ్చే సీజన్‌లో ఆడతాడా? లేదంటే ఇక అతడి ఐపీఎల్‌ కెరీర్‌ ముగిసినట్లేనా? అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఇలాంటి తరుణంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ధోని గురించి ప్రశ్న.. నాకేం తెలుసు?
గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన రుతురాజ్‌కు ధోని భవిష్యత్‌ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘వచ్చే ఏడాదే ఈ విషయం గురించి స్పష్టత వస్తుంది. నాకు కూడా దీని గురించి ప్రస్తుతానికి ఏమీ తెలియదు. మీతో పాటే వచ్చే ఏడాదే నేనూ ధోని ఆడతాడా? లేదా? అనేది తెలుసుకుంటాను’’ అని రుతురాజ్‌ గైక్వాడ్‌ పేర్కొన్నాడు.

ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించే ధోనిని ఈ సీజన్‌లో తాము బాగా మిస్సయ్యామన్న రుతురాజ్‌.. ఆయన ఉంటే పరిస్థితి ఉంటే కాస్త భిన్నంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ధోని లేని లోటు ఎవరూ తీర్చలేరని.. అయితే, ప్రస్తుతం ఉన్న జట్టుతో తాము సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపాడు.

చదవండి: సీఎస్‌కేకు మరో దెబ్బ.. ఈసారి తుదిజట్టు మొత్తానికీ శిక్ష!

Advertisement
 
Advertisement
Advertisement