వైభవ్‌ X గుజరాత్‌ | Gujarat Titans VS Rajasthan Royals ipl 2026 Qualifier 2 Preview | Sakshi
Sakshi News home page

వైభవ్‌ X గుజరాత్‌

May 29 2026 4:34 AM | Updated on May 29 2026 4:34 AM

Gujarat Titans VS Rajasthan Royals ipl 2026 Qualifier 2 Preview

నేడు ఐపీఎల్‌ రెండో క్వాలిఫయర్‌ 

గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ ‘ఢీ’

గెలిచిన జట్టు ఫైనల్లోకి 

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

న్యూ చండీగఢ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మూడోసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించడమే లక్ష్యంగా... నేడు మాజీ చాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్, రాజస్తాన్‌ రాయల్స్‌ రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్‌ బెర్త్‌ లభిస్తుంది. క్వాలిఫయర్‌–1లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించి డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఇప్పటికే టైటిల్‌ పోరుకు చేరుకుంది. 

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తు చేసి రాజస్తాన్‌ రాయల్స్‌ ఫైనల్లో చోటు కోసం మరోపోరుకు సిద్ధమైంది.  తొలి ఐపీఎల్‌ సీజన్‌లో (2008) విజేతగా అవతరించిన రాజస్తాన్‌ 2022లో రెండోసారి ఫైనల్‌ చేరి గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. గుజరాత్‌ జట్టు 2022లో తొలిసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచి, 2023లో రన్నరప్‌ ట్రోఫీతో సంతృప్తి పడింది. 

సన్‌రైజర్స్‌తో ఇదే వేదికపై జరిగిన ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ విశ్వరూపం ప్రదర్శించి రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి మరోసారి వైభవ్‌పైనే కేంద్రీకృతమైంది. వైభవ్‌ 10 ఓవర్లు క్రీజులో ఉంటే మాత్రం రాజస్తాన్‌ రాయల్స్‌ మరోసారి ప్రత్యరి్థకి 200 పరుగులపైనే లక్ష్యాన్ని నిర్దేశించడం ఖాయం. వైభవ్‌ను పవర్‌ప్లే లోపు అవుట్‌ చేస్తే మాత్రం గుజరాత్‌  పైచేయి సాధించే అవకాశం ఉంటుంది.   

టాప్‌–3పైనే భారం 
బలాబలాల పరంగా చూస్తే రెండు జట్లలో సారూప్యత కనిపిస్తోంది. ఈ సీజన్‌లో రెండు జట్లు ఎక్కువగా టాప్‌–3 బ్యాటర్లపైనే ఆధారపడ్డాయి. వైభవ్‌ సూర్యవంశీ (15 మ్యాచ్‌ల్లో 680 పరుగులు), యశస్వి జైస్వాల్‌ (15 మ్యాచ్‌ల్లో 426 పరుగులు), ధ్రువ్‌ జురేల్‌ (15 మ్యాచ్‌ల్లో 508 పరుగులు) ఈ సీజన్‌లో నిలకడగా రాణించారు. 

మరోవైపు గుజరాత్‌ టాపార్డర్‌ బ్యాటర్లు శుబ్‌మన్‌ గిల్‌ (14 మ్యాచ్‌ల్లో 618 పరుగులు), సాయి సుదర్శన్‌ (15 మ్యాచ్‌ల్లో 652 పరుగులు), జోస్‌ బట్లర్‌ (15 మ్యాచ్‌ల్లో 498 పరుగులు) కూడా ఈ సీజన్‌లో మెరిపించారు. రెండు జట్ల మిడిలార్డర్‌ బలహీనంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్ల టాపార్డర్‌ బ్యాటర్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగితే భారీ స్కోర్లు ఆశించలేము. ఒకవేళ క్రీజులో నిలదొక్కుకుంటే మాత్రం పరుగుల విందు ఖాయమనుకోవాలి. గుజరాత్‌ ఓపెనర్లు గిల్, సాయి సుదర్శన్‌ ఇద్దరు కలిపి మొత్తం 59 సిక్స్‌లు కొట్టగా... రాజస్తాన్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ ఒక్కడే 65 సిక్స్‌లు బాదాడు.  

బౌలర్ల తడాఖా... 
బౌలింగ్‌ విభాగానికొస్తే గుజరాత్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. గుజరాత్‌ పేస్‌ బౌలర్లు రబాడ 26 వికెట్లు, సిరాజ్‌ 17 వికెట్లు, ప్రసిధ్‌ కృష్ణ 15 వికెట్లు, హోల్డర్‌ 15 వికెట్ల చొప్పున పడగొట్టారు. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ 19 వికెట్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు రాజస్తాన్‌ పేసర్లు ఆర్చర్‌ 24 వికెట్లు నేలకూల్చగా... బ్రిజేశ్‌ శర్మ, బర్గర్‌ 13 
వికెట్ల చొప్పున తీశారు. 

రెండు జట్ల ఓపెనర్లు ఆరంభంలో వికెట్‌ ఇవ్వకుంటే భారీ స్కోరుకు బాటలు పడతాయి. ఈ సీజన్‌లో ఛేజింగ్‌ చేసిన జట్లు 43 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... 27 మ్యాచ్‌ల్లో ఓడిపోయాయి. ఒక మ్యాచ్‌ వర్షంతో రద్దు కాగా, మరో మ్యాచ్‌ ‘టై’ అయింది. ఐపీఎల్‌ 19 సీజన్‌లను పరిశీలిస్తే ‘నాకౌట్‌’ మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 36 సార్లు గెలుపొందగా... ఛేజింగ్‌ చేసిన జట్టు 35 సార్లు విజయం అందుకుంది.

పిచ్, వాతావరణం 
ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్‌నే క్వాలిఫయర్‌–2లోనూ వాడనున్నారు. ఫలితంగా ఈసారి ఛేజింగ్‌ చేసే జట్టు ఇబ్బంది పడవచ్చు. మ్యాచ్‌ రోజున మధ్యాహ్నం వడగళ్ల వాన కురిసే అవకాశముంది. అయితే సాయంత్రం మేఘావృతంగా ఉండి మ్యాచ్‌కు ఆటంకం ఉండకపోవచ్చు.  

జట్ల వివరాలు (అంచనా) 
గుజరాత్‌ టైటాన్స్‌: శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), సాయి సుదర్శన్, జోస్‌ బట్లర్, నిశాంత్, వాషింగ్టన్‌ సుందర్, రాహుల్‌ తేవాటియా, జేసన్‌ హోల్డర్, రషీద్‌ ఖాన్, రబాడ, సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, మానవ్‌ సుతార్‌/సాయికిశోర్‌. 

రాజస్తాన్‌ రాయల్స్‌: రియాన్‌ పరాగ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, వైభవ్‌ సూర్యవంశీ, ధ్రువ్‌ జురేల్, డోనోవాన్‌ ఫెరీరా, షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, బర్గర్, బ్రిజేశ్‌ శర్మ, సుశాంత్‌ మిశ్రా, యశ్‌రాజ్‌ పుంజా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement