సచిన్‌కు ‘గోల్డెన్‌ టికెట్‌’ | Sakshi
Sakshi News home page

సచిన్‌కు ‘గోల్డెన్‌ టికెట్‌’

Published Sat, Sep 9 2023 3:03 AM

Golden ticket for Sachin - Sakshi

ముంబై: భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ ప్రత్యేక అతిథులుగా ఎంపిక చేసిన కొందరు ప్రముఖులకు బీసీసీఐ వరుసగా ‘గోల్డెన్‌ టికెట్‌’ ఇచ్చి మ్యాచ్‌లకు ఆహ్వానిస్తోంది. ఇటీవలే నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు ఈ టికెట్‌ అందించిన బోర్డు కార్యదర్శి జై షా తాజాగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు ‘గోల్డెన్‌ టికెట్‌’ అందించారు.

అద్భుత క్రికెటర్, జాతికి గర్వకారణంగా నిలిచిన ‘భారత రత్న’ సచిన్‌కు టికెట్‌ అందించడం పట్ల జై షా సంతోషం వ్యక్తం చేశారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సచిన్‌లాంటి వ్యక్తి ఇప్పుడు వరల్డ్‌కప్‌లో ఒక భాగంగా మారారని వ్యాఖ్యానించారు.  

కొత్త టికెట్లూ హుష్‌ కాకి! 
వరల్డ్‌ కప్‌ అభిమానులను దృష్టిలో ఉంచుకొని 4 లక్షల టికెట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చినట్లు బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. కానీ పరిస్థితి చూస్తే ఏమీ మారలేదని అర్థమవుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి టికెట్లు అమ్మకానికి పెట్టారు. అయితే భారత్‌కు సంబంధించి అన్ని మ్యాచ్‌లకూ టికెట్లే లేని పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని మ్యాచ్‌లకు ‘సోల్డ్‌ అవుట్‌’ చూపిస్తుండగా... మిగతా మ్యాచ్‌లకు మీరు క్యూలో ఉన్నారు అని ‘బుక్‌ మై షో’ చెబుతోంది.

గతంతో పోలిస్తే టికెట్‌ కోసం ప్రయతి్నస్తున్నవారికి వేచి ఉండాల్సిన సమయం వేర్వేరుగా చూపించగా... ఇప్పుడు అందరికీ ఒకే మెసేజ్‌ ‘90 నిమిషాలు’ అనే చూపిస్తుండటం విశేషం! అసలు ఏ మ్యాచ్‌కు ఎన్ని టికెట్లు అమ్ముతున్నారనే విషయంపైనే సమాచారం లేకపోగా, 4 లక్షల టికెట్ల గురించి ఎక్కడా స్పష్టత లేదు! చూస్తుంటే ఇదంతా అభిమానులను కాస్త ఓదార్చించేందుకు బీసీసీఐ ఆడిన ఒక డ్రామాలాగానే కనిపిస్తోంది.   

Advertisement
Advertisement