‘బుల్లెట్‌ శకలాలు ఇంకా నా శరీరంలో ఉన్నాయి’ | Former Sri Lanka Captain Sangakkara Comments on incident in pakistan | Sakshi
Sakshi News home page

‘బుల్లెట్‌ శకలాలు ఇంకా నా శరీరంలో ఉన్నాయి’

Apr 16 2026 4:00 AM | Updated on Apr 16 2026 4:00 AM

Former Sri Lanka Captain Sangakkara Comments on incident in pakistan

శ్రీలంక మాజీ కెప్టెన్‌ సంగక్కర వ్యాఖ్య 

2009 పాకిస్తాన్‌లో బాంబు దాడి ఘటన

కొలంబో: దాదాపు పదిహేడేళ్ల క్రితం... శ్రీలంక జట్టు పాకిస్తాన్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడుతోంది. లాహోర్‌లో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట కోసం లంక జట్టు గడాఫీ స్టేడియం సమీపానికి  చేరుకుంది. అయితే ఆ సమయంలో అనూహ్యంగా తీవ్రవాదులు శ్రీలంక ఆటగాళ్లతో కూడిన టీమ్‌ బస్సుపై కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న పోలీసులు ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోగా, మరో 20 మంది గాయపడ్డారు.నాటి సంఘటనను సంగక్కర ఇటీవల గుర్తు చేసుకున్నాడు. తన జీవితంలో అది ఎలాంటి మార్పు తెచ్చిందో వెల్లడించాడు. 

‘మేం స్టేడియానికి బయల్దేరే ముందు మా టీమ్‌ పేస్‌ బౌలర్‌ ఒకరు ఇలాంటి పిచ్‌పై బౌలింగ్‌ చేస్తే నా వెన్ను విరిగిపోవచ్చు. దానికన్నా ఒక బాంబు దాడి జరిగి ఇంటికి వెళ్లిపోతే బాగుంటుంది అని సరదాగా అన్నాడు. అయితే నిజంగానే అది జరిగింది. మరు నిమిషంలోనే మాపై ఉగ్రవాదులు దాడి చేశారు. మేం అందులో గాయపడ్డాం. నాడు దాడిలో మాపై దూసుకొచ్చిన బుల్లెట్‌ శకలాలు నా శరీరంలో ఇప్పటికీ ఉన్నాయి. ఆ దాడి నా ఆలోచనా ధోరణిని మార్చింది. ఎందుకంటే అదే సమయంలో మా దేశంలో అంతర్యుద్ధం కూడా జరుగుతూ చివరి దశలో ఉంది. 

కానీ మాపై రెండు నిమిషాల దాడి పెద్ద వార్తగా మారింది. కొన్నాళ్ల తర్వాత ఒక సైనికుడు ఎలా ఉన్నారంటూ మమ్మల్ని అడిగాడు. నేను బాగున్నానని చెబుతూ మీరు మాత్రం ఎన్నో ఏళ్లుగా ఇలాంటి పరిస్థితుల్లోనూ జీవిస్తున్నారు కదా అన్నాను. క్రికెట్‌ ఆడుతూ ఎంతో డబ్బు గడిస్తూ కూడా రెండు నిమిషాల దాడితో వార్తల్లో నిలిచామంటే గత 20–26 ఏళ్లుగా దేశం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో అర్థమైంది’ అని సంగక్కర గుర్తు చేసుకున్నాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement