రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్ ఎంపికవడం వెనుక ఫ్రాంచైజీ పెద్దల నుంచి ప్రత్యేక మద్దతు గట్టిగా ఉందంటూ భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు చాలా మందే ఉన్నప్పటికీ కెప్టెన్‌గా పరాగ్ ఎంపిక తనను ఆశ్చర్చపరిచిందన్నాడు.
శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘అతడు కెప్టెన్ ఎలా అయ్యాడో అందరికీ తెలుసు. ఎందుకంటే అది రాజస్థాన్ ప్రాంచైజీ పెద్దల నిర్ణయం. అక్కడ రియాన్ పరాగ్‌ను వాళ్లు రాజులా చూసుకుంటారు. రాజస్థాన్ పరాగ్‌ను ఆకాశానికెత్తుతోంది కానీ అతడికి అంత సీన్ లేదు. గతేడాది పరాగ్‌కు అంతగా కలిసిరాలేదు. సంజూ శాంసన్ గైర్హాజరీలో కెప్టెన్‌గా సేవలందించిన పరాగ్‌లో నాయకత్వ ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. కానీ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లను కాదని ఈ సీజన్‌లోనూ అతడికే కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు.
సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్లకు చెన్నై ట్రేడింగ్ చేసుకున్నప్పటికీ అతడి స్థానంలో రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లు రాజస్థాన్‌కు బదిలీ అయ్యారు. జడేజా, జైస్వాల్, ధ్రువ్ జురేల్ లాంటి నాయకత్వ సామర్థ్యం కలిగిన ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదో చెప్పాలి’ అని పేర్కొన్నారు. ఇక ఈ సీజన్‌లో రాజస్థాన్ విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయనే ప్రశ్నకు శ్రీకాంత్ సమాధానమిచ్చాడు.
‘గత సీజన్‌తో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ మెరుగ్గానే కనిపిస్తోంది. ప్రత్యర్థి జట్లను ఓడించే సత్తా వీరికి ఉన్నప్పటికీ అంత ప్రమాదకరం కాదు. టాప్ ఐదుగురిలో ఇద్దరు రాణించినా రాజస్థాన్‌కు తిరుగుండదు. జైస్వాల్-వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీ జట్టుకు పెద్ద బలం కానుంది. హెట్‌మైర్, జడేజా, షనక, ధ్రువ్ జురేల్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. రాజస్థాన్‌కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు 50-50 శాతమే’ అని తెలిపాడు.
ఇక రియాన్ పరాగ్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్‌ల్లో 393 పరుగులు సాధించాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. 2017 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కే ఆడుతున్న రియాన్ పరాగ్ ఇప్పటివరకు 84 మ్యాచ్‌ల్లో ఏడు అర్థశతకాలతో 1566 పరుగులు సాధించాడు.
అయితే పరాగ్‌లో నిలకడలేమి అతనికి పెద్ద సమస్యగా మారిందని చెప్పొచ్చు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆడనుంది.


