
ఐపీఎల్ తాజా సీజన్‌లో తాను అనుకున్న విధంగా రాణించలేకపోయానని, అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యానని ముంబై ఇండియన్స్ బ్యాటర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. అయితే దాని గురించి ఇప్పుడు అతిగా ఆలోచించడం అనవసరమని అతను అభిప్రాయపడ్డాడు.
‘ఒక బ్యాటర్‌గా నేను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనేది వాస్తవం. ఇప్పుడు దానిని విశ్లేíÙంచి లాభం లేదని ఇన్నేళ్ల అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడు మానసికంగా కాస్త ప్రశాంతంగా ఉండటం అవసరం. ప్రాక్టీస్ కొనసాగిస్తూ ఆటను మెరుగుపర్చుకోవడమే నేను చేయగలిగింది’ అని రోహిత్ స్పష్టం చేశాడు.
ఐపీఎల్ సీజన్ తమ జట్టు ప్రణాళికల ప్రకారం సాగలేదని, ఎన్నో తప్పులు చేశామన్న రోహిత్ శర్మ...తాము గెలవాల్సిన మ్యాచ్‌లను స్వల్ప తేడాతో చేజార్చుకున్నామని అన్నాడు. మరో వైపు భారత జట్టు విషయంలో తనకు ఎలాంటి సందేహాలు లేవని కెప్టెన్ అన్నాడు. ఐపీఎల్ ప్రదర్శనతో సంబంధం లేకుండా జట్టులోని ప్రతీ ఒక్కరికీ తమ బాధ్యతలేమిటో స్పష్టంగా తెలుసని అతను పేర్కొన్నాడు.