Sourav Ganguly: గంగూలీ కథ ముగిసినట్లే..!

End Card For Sourav Ganguly As BCCI President Intresting Facts - Sakshi

టీమిండియాకు ఆడే సమయంలో కెప్టెన్‌గా చక్రం తిప్పిన సౌరవ్‌ గంగూలీ అలియాస్‌ దాదా.. బీసీసీఐ బాస్‌గానూ గత మూడేళ్లలో తనదైన ముద్ర చూపించాడు. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. బీసీసీఐ అధ్యక్షుడిగా మరోమారు ఉండాలని ఆశపడిన గంగూలీకి ఆ అవకాశం లేనట్లే. అధ్యక్ష పదవి రెండోదఫా ఇచ్చే సంప్రదాయం లేదని దాదాకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఐపీఎల్‌ చైర్మన్‌ పదవిని తిరస్కరించిన దాదా.. ఐసీసీ పదవికి కూడా గంగూలీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో దాదా కథ ఇక ముగిసినట్లేనని క్రీడావర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొత్త అధ్యక్షుడు రానున్నాడు. పాత అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీని సాగనంపేందుకే బోర్డు పెద్దలు నిర్ణయించారు. ఇది ఎవరూ ఊహించని అనూహ్య పరిణామం! ఎందుకంటే బోర్డు అధ్యక్ష స్థానం కోసమే గంగూలీ సుప్రీం కోర్టు మెట్లెక్కాడు. పదవుల మధ్య విరామం (కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌) మినహాయింపు కోసం న్యాయపోరాటం చేసి విజయం సాధించాడు. 

కానీ బోర్డు కార్యవర్గంలో మాత్రం తన మాట నెగ్గించుకున్నట్లు లేడు. అందుకే తెరపైకి రోజర్‌ బిన్నీ వచ్చారు. భారత్‌ తొలి వన్డే ప్రపంచకప్‌ (1983) విజేత జట్టు సభ్యుడైన బిన్నీకే బీసీసీఐ పెద్దలు జైకొట్టడంతో అనూహ్యంగా మంగళవారం 67 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్‌ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేశారు. నేటితో నామినేషన్ల గడువు ముగుస్తుంది. కార్యదర్శిగా మళ్లీ జై షా కొనసాగేందుకు రంగం సిద్ధమైంది. అతను కూడా ఆ పదవికి నామినేషన్‌ దాఖలు చేశాడు. ఈనెల 18న బీసీసీఐ ఎన్నికలు జరుగుతాయి.  

ఐపీఎల్‌ కమిషనర్‌ పదవి తిరస్కరణ 
కొన్ని రోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసిన ‘దాదా’ మళ్లీ అధ్యక్షుడయ్యేందుకు బోర్డు ఉన్నతాధికారులతో మంతనాలు జరిపాడు. వచ్చే ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో గంగూలీ తన పదవిని అట్టిపెట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా కనుసన్నల్లోని బోర్డు వర్గాలు గంగూలీని కొనసాగించేందుకు సుముఖంగా లేవు.

ఈ నేపథ్యంలో ఉన్నపళంగా బిన్నీని తెరపైకి తెచ్చారు. గంగూలీని ఐపీఎల్‌ కమిషనర్‌ పదవి తీసుకోమన్నారు. కానీ బోర్డులో అధ్యక్షుడిగా పనిచేసిన ‘దాదా’ ఓ సబ్‌ కమిటీకి చీఫ్‌ అయ్యేందుకు నిరాకరించారని బోర్గు వర్గాలు తెలిపాయి. దీంతో కమిషనర్‌ బ్రిజేశ్‌ పటేల్‌ స్థానంలో ప్రస్తుత కోశాధికారి, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడైన అరుణ్‌ ధుమాల్‌ను ఐపీఎల్‌ కమిషనర్‌గా నియమించే అవకాశాలున్నాయి.

మహారాష్ట్ర బీజేపీ నేత, ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు ఆశిష్‌ షెలార్‌ ఇకపై బోర్డు కోశాధికారిగా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మకు అత్యంత సన్నిహితుడు దేవజిత్‌ సైకియా సంయుక్త కార్యదర్శిగా ఖరారయ్యారు. ఉపాధ్యక్ష పదవి మాత్రం రాజీవ్‌ శుక్లా నుంచి మారడం లేదు. కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడైన రాజీవ్‌ శుక్లా మరోసారి ఆ పదవిలో కొనసాగనున్నారు. ఐసీసీలో కీలక పదవికి గంగూలీని నామినేట్‌ చేసే అంశం అసలు బోర్డులో చర్చకే రాలేదని పూర్తిగా బోర్డు పదవులపైనే ఢిల్లీలో మంతనాలు జరుగుతున్నట్లు తెలిసింది.    

చదవండి: 'ఇలాగే ఉంటే టెన్త్‌ కూడా పాసవ్వలేవన్నారు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top