
లక్నో: భారత పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) విజయవంతమైన బౌలింగ్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేసిన అతని సోదరి అఖండ్ జ్యోతి సింగ్ భావోద్వేగానికి గురైంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న జ్యోతికి.. ఎడ్జ్‌బాస్టన్‌లోని పది వికెట్ల ప్రదర్శన అంకితమిస్తున్నట్లు మ్యాచ్ ముగిసిన అనంతరం ఆకాశ్‌దీప్ వ్యాఖ్యానించాడు.
ఈ నేపథ్యంలో ఓ వార్తా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన జ్యోతి తన సోదరుడికి తన ఆనారోగ్యంపై చింతించకుండా దేశం కోసం శ్రమించాలని చెప్పినట్లు వెల్లడించింది.
మా నాన్న చనిపోయినపుడు..
క్యాన్సర్ బారిన పడటంతో తన కుటుంబానికి దూరమైన ఆనందాన్ని ఆకాశ్‌దీప్ తన ఆటతీరు ద్వారా తిరిగి తీసుకొచ్చాడని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తమ కుటుంబాన్ని 2015 ఏడాది పెను విషాదంలో ముంచిందని... మళ్లీ ఇన్నాళ్లకు ఆనందం వెల్లివిరిసిందని జ్యోతి చెప్పింది.
‘మా నాన్న చనిపోయినపుడు ఆకాశ్ ఢిల్లీలో క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే ఆశించిన ఎదుగుదల రాలేదు. దీంతో నేను గట్టిగా చెప్పాను. క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకుంటేనే రాణిస్తావని చెప్పా. ఇక్కడ కుదరకపోతే మరో చోటయినా ప్రయత్నించాలని సూచించాను.
దీంతో 2017లో కోల్‌కతాకు మారాక బెంగాల్ అండర్–23 జట్టు తరఫున నిలకడగా రాణించడం మొదలుపెట్టాడు. ఒకే ఏడాది తండ్రి, ఓ తమ్ముడు మరణించడంతో మా కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అయినా సరే దేనికి దిగులు చెందక ఆకాశ్ లక్ష్యాన్ని చేరుకునేందుకు మా వంతు ప్రయత్నం మేం చేశాం’ అని జ్యోతి వివరించింది.

జబ్బు గురించి చెప్పాలనుకోలేదు
ఈ మ్యాచ్‌ను మేమంతా చూశాం. వికెట్ తీసిన ప్రతీసారి గట్టిగా చప్పట్లతో సంబరం చేసుకున్నాం. దీంతో ఇరుగు పొరుగువారు వచ్చి ఏమైందని అడిగి వెళ్లిపోయారు. దేశానికి విజయాన్నిచ్చిన అతని ప్రదర్శన మాకైతే పండగను తెచ్చింది. ఇక మీడియాలో నా జబ్బు సంగతి చెప్పినట్లు మొదట తెలియదు.
ఎందుకంటే నా క్యాన్సర్ గురించి బయటికి వెల్లడించేందుకు మా కుటుంబం సిద్ధంగా లేదు. బహుశా నాపై అప్యాయత కొద్దీ ఆ క్షణం భావోద్వేగానికి గురై అక్కకు అంకితం చేస్తున్నానని చెప్పి ఉండొచ్చు. నేనన్నా... కుటుంబమన్నా అతనికి వల్లమాలిన ప్రేమ. నాకిప్పుడు క్యాన్సర్ మూడో దశలో ఉంది. ఇంకో ఆర్నేళ్ల చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఆ తర్వాతే ఏమవుతుందో చూడాలి.
ఐపీఎల్ సమయంలో హాస్పిటల్‌కు...
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించే ఆకాశ్ లీగ్ జరిగే సమయంలో పది వేదికలు మార్చి మార్చి ఆడే అంతటి బిజీ షెడ్యూల్‌లోనూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నన్ను పరామార్శించేందుకు మ్యాచ్ ముందో, తర్వాతో తప్పకుండా వచ్చేవాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికపై విజయం సాధించాక రెండుసార్లు వీడియో కాల్‌లో మాట్లాడుకున్నాం.
అప్పుడు అతను.. నాతో .. ‘‘అక్క ఏమాత్రం బాధపడకు. దేశం మొత్తం మనవెంటే ఉందని చెప్పడంతో ఆ క్షణం నన్ను నేను నియంత్రించుకోలేక భావోద్వేగానికి గురై ఏడ్చేశాను. నిజం చెబుతున్నా... ఇలాంటి తమ్ముడు చాలా అరుదుగా ఉంటాడు.
మాకెప్పుడు అండగా ఉంటాడు. మాకు చెప్పందే ఏదీ చేయడు. ప్రతి విషయాన్ని కుటుంబంతో పంచుకుంటాడు. ఆర్నెళ్ల వ్యవధిలోనే మా నాన్న, ఒక సోదరుడు మరణించడంతో కుటుంబభారాన్ని ఆకాశే అన్నీ తానై మోస్తున్నాడు.
ఆకాశమంత ధైర్యం
నేను క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆకాశ్ మాటలే నా స్థయిర్యాన్ని పెంచేవి. నా ఆరోగ్యం గురించే ఆలోచించేవాడు. అప్పుడు నేను అతని దృష్టి ఆటపైనే కేంద్రీకరించేందుకు ధైర్యం చెప్పేదాన్ని.
‘నేనిప్పుడు బాగానే ఉన్నాను. నా కోసం బాధపడొద్దు. నాకు తోడుగా నా భర్త ఉన్నాడు. నీవేం విచారించకు’ అని చెబితే... వెంటనే కల్పించుకుని తానేం చేసినా, సాధించినా సోదరిల కోసం, కుటుంబం కోసమే అని బదులిచ్చాడు.
మా తల్లిదండ్రులకు మేం ఆరుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలం. ఆకాశ్ అందరికంటే చిన్నవాడు. నేను తనకంటే పదేళ్లు పెద్ద. చిన్నప్పటి నుంచి కూడా మా ఇద్దరి మధ్య ఆప్యాయత ఎక్కువే. మ్యాచ్‌కు ముందు, తర్వాత నాకు వీడియో కాల్ చేసి మాట్లాడతాడు. నేను తీసిన ఈ వికెట్లు నీ కోసం, దేశం కోసం’ అని గర్వంగా చెబుతాడు.
రాగానే దహీ వడ తినిపిస్తా
ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి రాగానే ఆకాశ్ దీప్‌కు ఇష్టమైన వంట చేసి పెడతా. తనకిష్టమైనవే కాదు... తను ఏం కావాలన్నా సరే వండిపెడతా. నేను చేసే దహీ వడ అంటే అతనికెంతో ఇష్టం. ఆకుకూరలతో చేసిన వంటకాలను ఇష్టంగా తింటాడు. మా ఇంటికి ఎప్పుడొచ్చినా అవే చేసిపెట్టాలంటాడు.
చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్