మొటెరా పిచ్‌ ఎవరికి లాభం చేకూర్చనుంది! 

Dilemma Over Motera Stadium Pitch For India England Pink Ball Test - Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి మొటెరా స్టేడియం వేదికగా డే-నైట్‌ టెస్టు మ్యాచ్‌(పింక్‌ బాల్‌ టెస్టు) జరగనున్న సంగతి తెలిసిందే. ఆధునాతన సౌకర్యాలతో లక్షా 10వేల సీటింగ్‌ కెపాసిటీతో నూతనంగా నిర్మించిన మొటెరా స్టేడియం ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్‌ మైదానంగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24 నుంచి డే నైట్‌ టెస్టుకు అన్ని హంగులతో సిద్ధమవుతుంది. ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారినవేళ ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అర్హతకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో మొటెరా పిచ్‌ ఎలా ఉండబోతుందనే విషయంపై తెగ చర్చ నడుస్తుంది. మొదటి రెండు టెస్టులు జరిగిన చెన్నై పిచ్‌కు, అహ్మదాబాద్‌ పిచ్‌కు చాలా తేడా ఉండనుంది. అందులోనూ మూడో టెస్టు డై నైట్‌ తరహాలో జరగనుండడంతో పిచ్‌ రిపోర్ట్‌పై మరింత ప్రాముఖ్యత సంతరించుకొంది. సాధారణంగా టీమిండియా టెస్టు మ్యాచ్‌లు ఆడే పిచ్‌లు స్పిన్నర్లకు అనువుగా ఉండేలా క్యూరేటర్లు తయారు చేస్తుంటారు. అయితే కొన్నేళ్లుగా వీటిలో మార్పు కనిపిస్తూ వచ్చింది. స్పిన్నర్లతో పాటు పేసర్లకు కూడా స్వర్గధామంగా నిలుస్తూ వచ్చాయి. తాజాగా మొతేరాలో పిచ్‌ నల్లమట్టి, ఎర్రమట్టి కాంబినేషన్‌తో కూడి ఉంది. ప్రధాన గ్రౌండ్‌లో 11పిచ్‌లు ఉన్న నేపథ్యంలో ఈసారి పిచ్‌ను స్పిన్నర్లుకు అనూకూలంగా ఉండేలా ఎర్రమట్టితో రూపొందించనున్నట్లు సమాచారం. మొదటి మూడు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా, చివరి రెండు రోజులు మాత్రం బౌలర్లకు అనుకూలించేలా పిచ్‌ను తీర్చిదిద్దారు.

అయితే గతంలో జరిగిన పింక్ బాల్‌‌ టెస్టులు చూసుకుంటే స్పిన్నర్ల కంటే సీమర్లు రాణించిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. 2019 నవంబర్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన డే నైట్‌ టెస్టులోనూ ఇదే నిరూపితమైంది.ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌, రెండో ఇన్నింగ్స్‌ కలిపి అన్ని వికెట్లు టీమిండియా పేసర్లే తీయడం విశేషం. ముఖ్యంగా ఇషాంత్‌ శర్మ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లతో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా ఇప్పుడు ఎక్కువగా స్పిన్నర్లను నమ్ముకోవడంతో తుది జట్టులో ఇద్దరు పేసర్లకు మాత్రమే అవకాశం ఉంది. అయితే క్యురేటర్లు మాత్రం పిచ్‌ను స్పిన్‌కు అనుకూలించే విధంగా రూపొందించినట్లు తెలిపారు. దీంతో పాటు మ్యాచ్‌ డే నైట్‌ కావడం.. రాత్రిళ్లు మంచుతో బౌలర్‌కు గ్రిప్పింగ్‌ చేజారడం జరుగుతుంటుంది. బంతి రంగు కూడా పిచ్‌పై కీలకపాత్ర పోషించనుంది. అందుకే పిచ్‌పై పచ్చిక ఎక్కువ లేకుండా చూసుకుంటూ కాస్త కఠినతరంగా రూపొందించనున్నారు. ఇక 2012లో మొటెరా మైదానంలో చివరి మ్యాచ్‌ జరిగింది. కాగా ఇటీవలే ముస్తాక్‌ అలీ ట్రోఫీ నాకౌట్‌ మ్యాచ్‌లకు కూడా ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. 
చదవండి: మూడో టెస్ట్‌తో సరికొత్త చరిత్ర ఆవిష్కృతం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top