
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో దబంగ్ ఢిల్లీ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లో విజయం సాధించిన దబంగ్ ఢిల్లీ జట్టు... తిరిగి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానానికి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పోరులో దబంగ్ ఢిల్లీ 43–26 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను మట్టికరిపించింది. ఢిల్లీ కెప్టెన్ అషు మాలిక్ 14 పాయింట్లతో విజృంభించగా... మిగిలినవాళ్లంతా అతడికి అండగా నిలిచారు. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ 12 పాయింట్లతో పోరాడినా తక్కిన వాళ్ల నుంచి అతడికి సరైన సహకారం దక్కలేదు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 22 రెయిడ్ పాయింట్లు సాధించగా... యోధాస్ 20 రెయిడ్ పాయింట్లు సాధించింది. అయితే ట్యాక్లింగ్‌లో సత్తాచాటిన ఢిల్లీ జట్టు 11 పాయింట్లు ఖాతాలో వేసుకోగా... యూపీ యోధాస్ 5 ట్యాక్లింగ్ పాయింట్లకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో యూపీ యోధాస్‌ను ఢిల్లీ జట్టు మూడుసార్లు ఆలౌట్ చేసింది. తాజా సీజన్‌లో 10 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 9 విజయాలు, ఒక పరాజయంతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’కు చేరింది. యూపీ యోధాస్ 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 6 పరాజయాలతో 8 పాయింట్లు సాధించి పట్టిక తొమ్మిదో స్థానంలో ఉంది.
శుక్రవారమే జరిగిన మరో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 45–33 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్‌పై గెలుపొందింది. తలైవాస్ సారథి అర్జున్ దేశ్వాల్ 22 పాయింట్లతో వీరవిహారం చేశాడు. శనివారం పుణేరి పల్టన్‌తో జైపూర్ పింక్ పాంథర్స్, గుజరాత్ జెయింట్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి.