ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్‌ | Conway Bowlers Shine New Zealand Beat South Africa 2nd T20I 68 Runs | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాపై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్‌

Mar 17 2026 3:37 PM | Updated on Mar 17 2026 4:26 PM

Conway Bowlers Shine New Zealand Beat South Africa 2nd T20I 68 Runs

తొలి టీ20లో సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ20 మ్యాచ్‌లో సఫారీ జట్టును మట్టికరిపించి జయభేరి మోగించింది. టీ20 ప్రపంచకప్‌-2026లో రన్నరప్‌గా నిలిచిన కివీస్.. ప్రస్తుతం స్వదేశంలో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తో బిజీగా ఉంది.

ఇందులో భాగంగా ఆదివారం మౌంట్‌ మౌంగనీ వేదికగా ప్రొటిస్‌తో తొలి టీ20లో తలపడ్డ న్యూజిలాండ్‌.. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తాజాగా హామిల్టన్‌లో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన కివీస్‌.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

డెవాన్‌ కాన్వే అర్ధ శతకం
టాపార్డర్‌లో ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ (11), వన్‌డౌన్‌ బ్యాటర్‌ టిమ్‌ రాబిన్సన్‌ (1) నిరాశపరచగా.. మరో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే అర్ధ శతకం (60)తో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో నిక్‌ కెలీ (12 బంతుల్లో 21), కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (14 బంతుల్లో 21) ఫర్వాలేదనిపించగా.. కోల్‌ మెకాంచి (12 బంతుల్లో 18), జోష్‌ క్లార్క్‌సన్‌ (9 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచారు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్‌ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. సఫారీ బౌలర్లలో వియాన్‌ ముల్డర్‌ రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్‌ కోయెట్జి, ఒట్నీల్‌ బార్ట్‌మాన్‌,  కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌, జార్జ్‌ లిండే తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

ఆదిలోనే ఎదురుదెబ్బలు
లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లలో కొన్నోర్‌ ఎస్తరూజెన్‌ (8)ను బెన్‌ సియర్స్‌ వెనక్కి పంపగా.. వియాన్‌ ముల్డర్‌ (16)ను సాంట్నర్‌ అవుట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన టోనీ జార్జి (1) మెకాంచీ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు.

107 పరుగులకే ఆలౌట్‌ 
మిగిలిన వారిలో రూబిన్‌ హెర్మాన్‌ (19) ఫర్వాలేదనిపించగా.. జార్జ్‌ లిండే 12 బంతుల్లో 33 పరుగులు చేశాడు. మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 15.3 ఓవర్లలో 107 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్‌ అయింది. ఫలితంగా న్యూజిలాండ్‌ 68 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను ప్రస్తుతానికి 1-1తో సమం చేసింది.

కివీస్‌ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్‌, బెన్‌ సియర్స్‌ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. సాంట్నర్‌ రెండు, మెకాంచి, జేమ్స్‌ నీషమ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. న్యూజిలాండ్‌- సౌతాఫ్రికా మధ్య శుక్రవారం నాటి మూడో టీ20కి ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ వేదిక.

చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఊహించని పేరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement