Commonwealth Games 2022: బౌల్స్‌లో బంగారం... టీటీలో పసిడి

Commonwealth Games 2022: India add medals in lawn bowls, table tennis, weightlifting and badminton - Sakshi

లాన్‌ బౌల్స్‌లో మహిళల బృందం కొత్త చరిత్ర

స్వర్ణం నిలబెట్టుకున్న టేబుల్‌ టెన్నిస్‌ జట్టు

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో మంగళవారం భారత్‌ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం చేరాయి. అనూహ్య ప్రదర్శనతో దూసుకొచ్చిన మహిళల లాన్‌ బౌల్స్‌ టీమ్‌ అదే అద్భుతాన్ని కొనసాగిస్తూ విజేతగా నిలవగా... అంచనాలను అందుకుంటూ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టీమ్‌ 2018లో సాధించిన స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. లాన్‌ బౌల్స్‌ తుదిపోరులో దక్షిణాఫ్రికాకు భారత్‌ షాక్‌ ఇవ్వగా... టీటీలో సింగపూర్‌పై మన ప్యాడ్లర్లు సత్తా చాటి జట్టును గెలిపించారు. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌ 96 కేజీల విభాగంలో వికాస్‌ ఠాకూర్‌ రజత పతకం సాధించాడు.  

అదే జోరు...
లాన్‌ బౌల్స్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. లవ్లీ, పింకీ, రూప, నయన్‌మోని సభ్యులుగా ఉన్న ‘ఫోర్స్‌’ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 17–10 పాయింట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. గత రెండు కామన్వెల్త్‌ క్రీడల్లోనూ పతకాలు నెగ్గిన సఫారీ టీమ్‌తో భారత్‌ పోరు ఆసక్తికరంగా సాగింది. ఎండ్‌–3 ముగిసేసరికి ఇరు జట్లు 2–2తో సమంగా నిలవగా, ఎండ్‌–4 తర్వాత భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది.

ఒకదశలో భారత్‌ 8–2తో దూసుకుపోగా, దక్షిణాఫ్రికా పోరాడటంతో ఎండ్‌–10 ముగిసేసరికి స్కోరు మళ్లీ 8–8, ఆపై 10–10తో సమమైంది. నిబంధనల ప్రకారం 15 ఎండ్‌ల తర్వాత ఆటను ముగించేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. ఎండ్‌–14 తర్వాత భారత్‌ 15–10తో ముందంజలో ఉండగా... చివరి ఎండ్‌లో 6 పాయింట్లు సాధిస్తే స్వర్ణం గెలిచే స్థితిలో దక్షిణాఫ్రికా నిలిచింది. అయితే ఇందులోనూ భారత్‌ 2 పాయింట్లు సాధించగా, సఫారీ మహిళలు ఒక్క పాయింట్‌ను కూడా గెలవలేక చేతులెత్తేశారు. చివరి ప్రయత్నంలో విసిరిన బౌల్‌...జాక్‌కు చాలా దూరంగా వెళ్లడంతో భారత్‌ స్వర్ణ సంబరాల్లో మునిగిపోయింది.  

టేబుల్‌ టెన్నిస్‌లో పురుషుల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ హవా కొనసాగింది. ఫైనల్లో భారత్‌ 3–1 తేడాతో సింగపూర్‌పై విజయం సాధించింది. తొలి మ్యాచ్‌ డబుల్స్‌లో హర్మీత్‌ దేశాయ్‌–సత్యన్‌ జోడీ 13–11, 11–7, 11–5తో యాంగ్‌ క్విక్‌–కూన్‌ పాంగ్‌పై గెలుపొందింది. అయితే ఆ తర్వాత సింగిల్స్‌లో భారత టాప్‌ ఆటగాడు ఆచంట శరత్‌ కమల్‌ అనూహ్యంగా 7–11, 14–12, 3–11, 9–11తో క్లారెన్స్‌ చూ చేతిలో ఓటమి పాలయ్యాడు. మరో సింగిల్స్‌లో సత్యన్‌ 12–10, 7–11, 11–7, 11–4తో ఎన్‌ కూన్‌ పాంగ్‌ను చిత్తు చేశాడు. ఆ తర్వాత కీలకమైన మూడో సింగిల్స్‌లో సత్తా చాటిన హర్మీత్‌ దేశాయ్‌ 11–8, 11–5, 11–6తో క్లారెన్స్‌ చూపై గెలుపొంది భారత్‌కు స్వర్ణం ఖాయం చేశాడు.

రజత ‘వికాసం’...
భారత సీనియర్‌ వెయిట్‌లిఫ్టర్‌ వికాస్‌ ఠాకూర్‌ వరుసగా మూడో కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషుల 96 కేజీల విభాగంలో 28 ఏళ్ల వికాస్‌ రజత పతకం సాధించాడు. పంజాబ్‌కు చెందిన వికాస్‌ మొత్తం 346 కేజీలు (స్నాచ్‌లో 155+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 191) బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. డాన్‌ ఒపెలోజ్‌ (సమోవా; 381 కేజీలు) స్వర్ణం, టానియెలా ట్యుసువా (ఫిజీ; 343 కేజీలు) కాంస్యం గెలిచారు. 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో రజతం నెగ్గిన వికాస్‌... 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో 94 కేజీల విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.  

హర్జిందర్‌కు రూ. 40 లక్షలు నజరానా
మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 71 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన తమ రాష్ట్ర క్రీడాకారిణి హర్జిందర్‌ కౌర్‌కు పంజాబ్‌ ప్రభుత్వం నగదు పురస్కారం ప్రకటించింది. హర్జిందర్‌కు రూ. 40 లక్షలు నజరానా ఇస్తామని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ తెలిపారు. బర్మింగ్‌హామ్‌లో సోమ వారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మహిళల 71 కేజీల విభాగం ఫైనల్లో 25 ఏళ్ల హర్జిందర్‌ మొత్తం 212 కేజీలు (స్నాచ్‌లో 93+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 119 కేజీలు) బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. సారా డేవిస్‌ (ఇంగ్లండ్‌; 229 కేజీలు) స్వర్ణం, అలెక్సిస్‌ యాష్‌వర్త్‌ (కెనడా; 214 కేజీలు) రజతం గెల్చుకున్నారు.  

పూనమ్‌ విఫలం...
మహిళల 76 కేజీల విభాగంలో పూనమ్‌ యాదవ్‌ విఫలమైంది. 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో 69 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన పూనమ్‌ తాజా గేమ్స్‌లో మాత్రం తన కేటగిరీలో చివరిస్థానంలో నిలిచింది. స్నాచ్‌లో 98 కేజీలు బరువెత్తిన ఈ ఉత్తర్‌ప్రదేశ్‌ లిఫ్టర్‌ క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైంది.

భారత్‌కు తొలి ఓటమి
మహిళల హాకీ ఈవెంట్‌లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. పూల్‌ ‘ఎ’లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 1–3 తేడాతో ఓటమి చవిచూసింది. వరుసగా మూడు విజయాలతో ఇంగ్లండ్‌ సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోగా... ఆరు పాయింట్లతో భారత్, కెనడా సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. నేడు కెనడాతో జరిగే మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తేనే సెమీస్‌ చేరుతుంది.

కామన్వెల్త్‌ క్రీడల్లో ఆచంట శరత్‌ కమల్‌ సాధించిన పతకాల సంఖ్య. 2006 మెల్‌బోర్న్‌ క్రీడల నుంచి వరుసగా బరిలోకి దిగిన అతను వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో కలిపి ఈ ఘనతను సాధించాడు. ఇందులో 5 స్వర్ణాలు, 2 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. భారత్‌ తరఫున కామన్వెల్త్‌ క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన ఆటగాడిగా షూటర్‌ గగన్‌ నారంగ్‌ (10) రికార్డును శరత్‌ కమల్‌ సమం చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top