సూర్య‌వంశీ విధ్వంసంపై స్పందించిన క్రిస్ గేల్‌ | Chris Gayle First Reaction on Vaibhav Sooryavanshi New Record | Sakshi
Sakshi News home page

సూర్య‌వంశీ రికార్డుపై క్రిస్ గేల్ ఫ‌స్ట్ రియాక్ష‌న్‌

May 28 2026 5:56 PM | Updated on May 28 2026 6:25 PM

Chris Gayle First Reaction on Vaibhav Sooryavanshi New Record

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎలిమినేటర్ మ్యాచ్‌లో సంచలనాత్మక ఇన్నింగ్స్‌తో చెల‌రేగిన రాజస్థాన్ రాయల్స్ సిక్స‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గ‌జం క్రిస్‌గేల్ ప్ర‌శంస‌లు కురిపించాడు. సూర్య‌వంశీని స‌రికొత్త‌ కొత్త సిక్సర్ల యంత్రంగా వ‌ర్ణించాడు. అత‌డి ఆట అద్భుతం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. 29 బంతుల్లో అత్యంత వేగవంతమైన ఐపీఎల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినందుకు  సూర్యవంశీని ఓదార్చాడు. ఏదో ఒక‌రోజు ఈ యువ బ్యాట‌ర్ త‌న రికార్డును బ్రేక్ చేస్తాడ‌న్న విశ్వాసాన్ని వ్య‌క్త ప‌రిచాడు.

న్యూ చండీగ‌ఢ్ వేదిక‌గా బుధ‌వారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌తో ప‌లు రికార్డు తిర‌గ‌రాశాడు. 3 ప‌రుగుల తేడాతో సెంచ‌రీ కోల్పోయాడు.  29 బంతుల్లో ఐదు ఫోర్లు, 12 సిక్సర్లతో 334కు పైగా స్ట్రైక్ రేట్‌తో 97 పరుగులు చేసి జ‌ట్టుకు ఒంటిచేత్తో విజ‌యాన్ని అందించాడు. 30 బంతుల్లో సెంచ‌రీ చేసిన క్రిస్‌గేల్ రికార్డును బ్రేక్ అవకాశాన్ని కొంచెంలో మిస్స‌య్యాడు. 2012లో గేల్ చేసిన 59 సిక్సర్లను రికార్డును మాత్రం సూర్య‌వంశీ బ‌ద్ద‌లు కొట్టాడు. ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు (65) కొట్టి స‌రికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 

వైభ‌వ్ సూర్య‌వంశీ రికార్డుల స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టా స్టోరీలో క్రిస్‌గేల్ షేర్ చేశాడు. అవుట్ స్టాండింగ్ అంటూ మెచ్చుకున్నాడు. ఏ న్యూ సిక్స్ మెషీన్ అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. సూర్య‌వంశీ ఇన్నింగ్స్‌ను మార‌ణ‌కాండ‌తో పోల్చాడు. సెంచ‌రీ మిస్ అయినందుకు దురదృష్టవంతుడు అంటూ కామెంట్ పెట్టాడు. త‌న రికార్డును ఎప్పటికైనా బ్రేక్ చేస్తాడని పేర్కొన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement