కింగ్స్‌ X రాయల్స్‌ | Chennai Super Kings vs Rajasthan Royals in IPL 2026 | Sakshi
Sakshi News home page

కింగ్స్‌ X రాయల్స్‌

Mar 30 2026 2:56 AM | Updated on Mar 30 2026 2:56 AM

Chennai Super Kings vs Rajasthan Royals in IPL 2026

నేడు చెన్నైతో రాజస్తాన్‌ ‘ఢీ’

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం  

గువాహటి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 19వ సీజన్‌లో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. సీజన్‌ ఆరంభానికి ముందే ప్లేయర్ల బదిలీతో వార్తల్లో నిలిచిన మాజీ చాంపియన్‌లు చెన్నై సూపర్‌ కింగ్స్, రాజస్తాన్‌ రాయల్స్‌ సోమవారం గువాహటి వేదికగా తలపడనున్నాయి. గతేడాది ఇరు జట్లు పేలవ ఆటతీరు కనబర్చాయి. చెన్నై పట్టికలో అట్టడుగున నిలవగా... రాయల్స్‌ తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. 

దశాబ్ద కాలానికి పైగా రాయల్స్‌కు కీలక ఆటగాడిగా ఉన్న సంజూ సామ్సన్‌ ఈసారి చెన్నై ఓపెనర్‌గా దర్శనమివ్వనుండగా... చెన్నై స్టార్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా తన పాత జట్టు రాజస్తాన్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇటీవల టి20 ప్రపంచకప్‌లో దంచికొట్టిన సామ్సన్‌ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. గాయం కారణంగా ధోనీ రెండు వారాల పాటు అందుబాటులో లేకపోవడంతో... వికెట్ల వెనుక పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత కూడా సామ్సన్‌పై ఉంది. 

కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి సంజూ ఇన్నింగ్స్‌ ఆరంభించనుండగా... శివమ్‌ దూబే, ఆయుశ్‌ మాత్రే, కార్తీక్‌ శర్మతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగానే ఉంది. హిట్టర్‌ బ్రెవిస్‌ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. వేలంలో రూ. 14.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న 20 ఏళ్ల స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ప్రశాంత్‌ వీర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలింగ్‌లో ఖలీల్, నూర్‌ అహ్మద్, అకీల్‌ హుసేన్, హెన్రీ కీలకం కానున్నారు. 

మరోవైపు రాజస్తాన్‌ జట్టుకు రియాన్‌ పరాగ్‌ సారథ్యం వహించనున్నాడు. 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, హెట్‌మైర్, ధ్రువ్‌ జురెల్‌ రూపంలో జట్టు నిండా హిట్టర్లు ఉన్నారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో జడేజా అనుభవం అక్కరకు రానుంది. ఆర్చర్‌ ప్రధాన పేసర్‌ కాగా... జడ్డూతో కలిసి రవి బిష్ణోయ్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement