చిదంబరం స్టేడియం వేదికగా నేడు పంజాబ్ కింగ్స్‌తో చెన్నై ‘ఢీ’
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్‌లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. గువాహటిలో ఆడిన గత మ్యాచ్‌లో ఓడిన చెన్నై... సొంతగడ్డపై పాయింట్ల ఖాతా తెరవాలని భావిస్తోంది. రాజస్తాన్ రాయల్స్‌తో పోరులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయం చవిచూసిన సూపర్ కింగ్స్... ఆ ఓటమిని పక్కనపెట్టి సమష్టిగా సత్తా చాటేందుకు సిద్ధమైంది.
గాయం కారణంగా ధోనీ ఈ మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగడం లేదు. అయితే అతడు డగౌట్ నుంచి సూచనలు ఇవ్వనుండటం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. టి20 వరల్డ్‌కప్ హీరో సంజూ సామ్సన్‌పై భారీ అంచనాలు ఉండగా... కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుశ్ మాత్రే, షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ కలిసి కట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో ఖలీల్, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, హెన్రీ కీలకం కానున్నారు. మరోవైపు గత మ్యాచ్‌లో గుజరాత్‌పై కష్టపడి గెలిచిన పంజాబ్ కింగ్స్ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.
ఆసీస్ ప్లేయర్ కూపర్ చక్కటి ఫామ్‌లో ఉండగా... కెప్టెన్ శ్రేయస్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్, నేహల్, శశాంక్, స్టొయినిస్, యాన్సెన్ రాణించాల్సి ఉంది. అర్ష్‌దీప్, జేవియర్, యాన్సెన్, వైశాఖ్, చాహల్ బౌలింగ్ భారం మోయనున్నారు. చెన్నై పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్ష సూచనలేదు.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు చెన్నై, పంజాబ్ మధ్య 32 మ్యాచ్‌లు జరిగాయి. ఇరు జట్లు చెరో 16 మ్యాచ్‌ల్లో గెలిచి సమంగా ఉన్నాయి. పంజాబ్‌పై చెన్నై అత్యధిక స్కోరు 240 కాగా... అత్యల్ప స్కోరు 120. చెన్నైపై పంజాబ్ అత్యధిక స్కోరు 231 కాగా, అత్యల్ప స్కోరు 92గా ఉంది.


