
టీమిండియా స్టార్ క్రికెటర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal)- యూట్యూబర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma) తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. గత కొంతకాలంగా వేరుగా ఉంటున్న ఈ జంటకు విడాకులు మంజూరు అయ్యాయి. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం (మార్చి 20) ఈ మేరకు తుదితీర్పును వెల్లడించింది.
ఈ నేపథ్యంలో చహల్ - ధనశ్రీ వేర్వేరుగా కోర్టుకు హాజరయ్యారు. విడాకుల అనంతరం వీరిద్దరు బయటకు వస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో చహల్ ధరించిన షర్టుపై ఉన్న సామెత నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
ధనశ్రీకి చహల్ కౌంటర్?
'Be your own sugar daddy' అని రాసి ఉన్న నలుపు రంగు కస్టమైజ్డ్ షర్టును చహల్ వేసుకున్నాడు. ఈ సామెతకు.. ‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’’ అనే అర్థం ఉంది. ఈ నేపథ్యంలో చహల్ తన మాజీ భార్య ధనశ్రీకి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ షర్టు ధరించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా లాక్‌డౌన్ సమయంలో ధనశ్రీ వద్ద డాన్స్ పాఠాలు నేర్చుకున్న చహల్ ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలో 2020, డిసెంబరులో ఇరు కుటుంబాల అంగీకారంతో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. ధనశ్రీ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తూ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా పేరు తెచ్చుకుంటోంది.
ఈ క్రమంలో వీరిద్దరు రీల్స్‌లో కనిపిస్తూ అభిమానులకు కనువిందు చేయడంతో పాటు.. టీమిండియా, ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం చహల్ వెంట వెళ్లిన ఫొటోలు కూడా పంచుకునేది. అయితే, కొన్నాళ్ల క్రితం తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి ధనశ్రీ ‘చహల్’ పేరును తీసివేసింది. దీంతో విడాకుల వార్తలు తెరమీదకు వచ్చాయి.
ఆర్థిక స్వాతంత్యం గురించి ప్రస్తావిస్తూ
ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తొలగించడంతో వీటికి మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో తాజాగా బాంద్రా కోర్టు వీరికి విడాకులు మంజూరు చేయడంతో.. వదంతులు నిజమేనని తేలాయి. ఇక విడాకుల నేపథ్యంలో ధనశ్రీకి చహల్ రూ. 4.75 కోట్ల భరణం చెల్లించేందుకు అంగీకరించాడు. ఇందులో ఇప్పటికే దాదాపు రెండున్నర కోట్లకు పైగా ముట్టజెప్పినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో చహల్.. ఆర్థిక స్వాతంత్యం గురించి ప్రస్తావిస్తూ ధనశ్రీకి హితవు పలికేలా ఈ సామెత ఉన్న షర్టును ధరించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా ధనశ్రీ గతంలో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి డాన్స్ చేసిన వీడియోలు వైరల్ కాగా.. అతడి పేరుతో ఆమెను ముడిపెట్టారు.
నిజానికి శ్రేయస్ సోదరి శ్రేష్ట కూడా కొరియోగ్రాఫర్ కావడం.. ధనశ్రీకి ఆమె స్నేహితురాలు కావడం వల్ల శ్రేయస్‌తో ఆమె డాన్స్ చేసి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మధ్యలో ఆమె!
అయితే, చహల్ ప్రస్తుతం ఆర్జే మహవశ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో కలిసి డిన్నర్ పార్టీలకు వెళ్లడం, ఐసీసీ చాంపియన్స్‌ట్రోఫీ-2025 సమయంలోనూ మహవశ్‌తో జంటగా కనిపించడం ‘ప్రేమ’ వార్తలకు ఊతమిచ్చాయి.
ఇక చహల్- ధనశ్రీ విడాకుల వేళ మహవశ్ కూడా.. ‘‘అబద్ధాలు, అత్యాశ, అబద్ధపు ప్రచారాలు.. దేవుడి దయవల్ల వీటన్నింటికీ అతీతంగా నిలబడగలుగుతున్నాం’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టడం గమనార్హం.
ఇందుకు నెటిజన్ల నుంచి భిన్న స్పందన వస్తోంది. చహల్- ధనశ్రీ మధ్య విభేదాలకు కారణం ఏమిటన్నది ఇప్పుడు అర్థమైందంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. ‘కొత్త వదినతోనైనా జాగ్రత్త’ అంటూ మరికొందరు ఉచిత సలహాలు ఇస్తున్నారు.
చదవండి: IPL 2025: ఈసారి విజేతగా ఆ జట్టే.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్