
తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగుల ఆధిక్యం
సెంట్రల్ జోన్ 556/8
వెస్ట్‌జోన్‌తో దులీప్ ట్రోఫీ సెమీస్
బెంగళూరు: బ్యాటర్ల సమష్టిగా రాణించడంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌కు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. వెస్ట్ జోన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సెంట్రల్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 157 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 556 పరుగుల భారీస్కోరు చేసింది.
ఓవర్‌నైట్ బ్యాటర్, కెప్టెన్ రజత్ పాటీదార్ (77; 14 ఫోర్లు) సహా ఉపేంద్ర యాదవ్ (87; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్ష్ దూబే (75; 13 ఫోర్లు) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో వెస్ట్‌జోన్ (438) తొలి ఇన్నింగ్స్ స్కోరును సెంట్రల్ అధిగమించింది. ప్రస్తుతం 118 పరుగుల ఆధిక్యంలో ఉన్న సెంట్రల్ చేతిలో ఇంకా 2 వికెట్లున్నాయి. వెస్ట్ బౌలర్లలో ధర్మేంద్రసింగ్ జడేజా 4 వికెట్లు తీశాడు.
నడిపించిన బ్యాటర్లు
సెంట్రల్ బ్యాటర్లంతా మూకుమ్మడిగా ఇన్నింగ్స్ బాధ్యతల్ని మోశారు. మూడో రోజు 229/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఆట కొనసాగించిన సెంట్రల్ ఇన్నింగ్స్‌కు మిడిలార్డర్ నుంచి టెయిలెండర్ల దాకా వెన్నెముకగా నిలిచారు. ప్రతీ ఒక్కరూ రాణించారు. ఓవర్‌నైట్ బ్యాటర్లలో రజత్ పాటీదార్ అర్ధసెంచరీ తర్వాత వేగంగా ఆడే క్రమంలో వికెట్‌ను కోల్పోయాడు.
కానీ శుభమ్ శర్మ (241 బంతుల్లో 96; 11 ఫోర్లు) నింపాదిగా ఆడుతూ సెంచరీ దిశగా పయనించాడు. ఉపేంద్ర అతనికి అండగా నిలిచాడు. ఇద్దరి ఆటతో సెంట్రల్ 300 పరుగులు దాటింది. కాసేపటికి సెంచరీకి చేరువైన శుభమ్ 4 పరుగుల తేడాతో మూడంకెల స్కోరుకు దూరమయ్యాడు. అతను రనౌట్ కాగా, హర్‡్ష దూబే వచ్చాక మళ్లీ వెస్ట్ బౌలర్లకు కష్టాలు మొదలయ్యాయి.
దూబే, ఉపేంద్ర ఫిఫ్టీ–ఫిఫ్టీ
క్రీజులో పాతుకుపోయిన హర్ష్, ఉపేంద్ర వెస్ట్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. దీంతో యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్‌లు సహా ఏకంగా 8 మంది బౌలర్లను వెస్ట్‌జోన్ ప్రయోగించింది. కానీ దూబే, ఉపేంద్ర పరుగులు చక్కబెట్టే పనికి ఏ దశలోనూ ఇబ్బంది ఎదురు కాలేదు. ఇద్దరు అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు కూడా చూస్తుండగానే వెస్ట్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (438)ను దాటింది.
బౌండరీలతో దూకుడుగా ఆడుతున్న హర్ష్ దూబేను ఎట్టకేలకు ధర్మేంద్రసింగ్ అవుట్ చేయడంతో ఆరో వికెట్‌కు 134 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపయ్యాక ములానీ బౌలింగ్‌లో ఉపేంద్ర కూడా అవుటయ్యాడు. వీరిద్దరిని పెవిలియన్‌కు చేర్చినప్పటికీ సెంట్రల్ ఆలౌట్ కాకుండా టెయిలెండర్లు సారాంశ్ జైన్ (83 బంతుల్లో 37 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చహర్ (52 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు.
శుభమ్ ఖజురియా అజేయ శతకం
రాణించిన నిశాంత్
నార్త్‌జోన్ 278/5
దులీప్ ట్రోఫీ సెమీస్
బెంగళూరు: ఓపెనర్ శుభమ్ ఖజురియా (245 బంతుల్లో 128 బ్యాటింగ్; 20 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో నార్త్‌జోన్ పోరాడుతోంది. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్‌జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆట నిలిచే సమయానికి నార్త్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 79 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. మిడిలార్డర్‌లో నిశాంత్ సింధు (148 బంతుల్లో 82; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.
సౌత్‌జోన్ పేసర్ గుర్‌జప్‌నీత్ సింగ్ (3/67) టాపార్డర్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ప్రస్తుతం నార్త్‌జోన్ చేతిలో 5 వికెట్లున్నప్పటికీ ఇంకా 258 పరుగులు వెనుకబడి ఉంది. మ్యాచ్‌కు కేవలం చివరి రోజు ఆటే మిగిలుంది. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఫైనల్ చేరాలన్నా నార్త్‌జోన్ రోజంతా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఓపెనర్ శుభమ్ మినహా స్పెషలిస్టు బ్యాటర్లెవరూ అందుబాటులో లేరు. ఇది నార్త్‌జోన్‌కు కష్టసాధ్యమైన సవాల్!
శతక్కొట్టిన ఖజురియా
తాజాగా మూడో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన నార్త్‌కు ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. శుభమ్ కజురియాతో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన కెప్టెన్ అంకిత్ కుమార్ (6) ఆరో ఓవర్లోనే వికెట్‌ను పారేసుకున్నాడు. గుర్‌జప్‌నీత్ సింగ్ అతన్ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 20 పరుగులకే తొలి వికెట్ కూలింది. ఈ గాయం నుంచి కోలుకోకముందే తన మరుసటి ఓవర్లో గుర్‌జప్‌నీత్ వన్‌డౌన్ బ్యాటర్ యశ్ ధుల్ (14)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో 38 పరుగులకే రెండు కీలక వికెట్లను నార్త్‌జోన్ కోల్పోయింది.
ఈ దశలో శుభమ్‌కు జతయిన ఆయుశ్ బదోని (57 బంతుల్లో 40; 5 ఫోర్లు) చక్కని సహకారం అందించడంతో వికెట్ల పతనం కాసేపు ఆగిపోయింది. ఇద్దరు వికెట్‌ను కాపాడుకుంటూ పరుగులు జతచేశారు. వీరిద్దరి సమన్వయంతో జట్టు స్కోరు వందను దాటింది. ఈ భాగస్వామ్యం బలపడుతున్న క్రమంలో బదోనిని నిధీశ్ ఎల్బీగా పెవిలియన్ పంపాడు. 63 పరుగుల భాగస్వామ్యం ముగియగా... ఈ దశలో క్రీజులోకి వచ్చిన నిశాంత్ సింధు ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను తీసుకున్నాడు.
నిశాంత్, కజురియా క్రీజులో పాతుకుపోవడంతో సౌత్‌జోన్ బౌలర్లు రెండో సెషన్‌లో శ్రమించాల్సి వచ్చింది. ఇద్దరూ కుదురుగా ఆడటంతో జట్టు స్కోరు 200 మార్క్‌ను దాటింది. బౌలింగ్‌లో 5 వికెట్లు పడగొట్టిన నిశాంత్ బ్యాటింగ్‌లోనూ రాణించి అర్ధసెంచరీ సాధించాడు. మరో వైపు ఓపెనర్ శుభమ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరి భాగస్వామ్యం దుర్భేధ్యంగా మారుతున్న దశలో మళ్లీ గుర్‌జప్‌నీత్ చావుదెబ్బ తీశాడు. నిశాంత్ సింధును అవుట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.