
దానిశ్, శుభమ్ అర్ధ సెంచరీలు
వెస్ట్ జోన్ 438 ఆలౌట్
దులీప్ ట్రోఫీ సెమీఫైనల్
బెంగళూరు: క్రీజులోకి దిగిన టాపార్డర్ బ్యాటర్లంతా రాణించడంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సెంట్రల్ జోన్ దీటైన జవాబిచ్చింది. వెస్ట్‌జోన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో దానిశ్ మాలేవర్ (136 బంతుల్లో 76; 12 ఫోర్లు, 1 సిక్స్), శుభమ్ శర్మ (148 బంతుల్లో 60 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 67 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది.
వెస్ట్ బౌలర్లలో ఆర్జన్ నగ్వాస్‌వాలా, ధర్మేంద్రసింగ్‌లకు చెరో వికెట్ దక్కింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 363/6తో ఆట కొనసాగించిన వెస్ట్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 108 ఓవర్లలో 438 పరుగుల వద్ద ఆలౌటైంది. కెపె్టన్ శార్దుల్ ఠాకూర్ (98 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించాడు. సారాంశ్ జైన్, హర్‡్ష దూబే చెరో 3 వికెట్లు తీయగా, ఖలీల్ అహ్మద్‌కు 2 వికెట్లు దక్కాయి.
నడిపించిన శార్దుల్
వెస్ట్‌జోన్‌ను నాయకుడు శార్దుల్ ఠాకూర్ నడిపించాడు. క్రితం రోజే అర్ధసెంచరీ బాదిన ఓవర్‌నైట్ బ్యాటర్ తనుశ్ కొటియాన్ (166 బంతుల్లో 76; 6 ఫోర్లు) మరో 11 పరుగులే జత చేసినప్పటికీ ఇతని అండతో శార్దుల్ ధాటిగా ఆడాడు. ఓ భారీ సిక్సర్‌తో అలరించిన ఠాకూర్, బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో జట్టు స్కోరు 400 పరుగులు దాటింది.
కాసేపటికి లేని పరుగుకు ప్రయత్నించి శార్దుల్ రనౌట్ కావడంతో ఆఖరి 4 వికెట్లు 27 పరుగుల వ్యవధిలోనే కూలాయి. తనుశ్‌తో పాటు ఆఖరి బ్యాటర్ ఆర్జన్ (3)లను హర్ష్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ధర్మేంద్రసింగ్ జడేజా (1) ఎల్బీ కాగా, తుషార్ దేశ్‌పాండే (18 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఓవర్‌నైట్ స్కోరుకు వెస్ట్ 75 పరుగులు జతచేసింది.
టాప్–4 సూపర్
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సెంట్రల్ జోన్‌కు టాప్–4 బ్యాటర్లు గొప్ప ఆరంభాన్నిచ్చారు. దానిశ్ మాలేవర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆయుశ్ పాండే (59 బంతుల్లో 40; 8 ఫోర్లు) వన్డే తరహా ఆటతీరుతో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. వేగంగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 67 పరుగుల వద్ద పాండే అవుట్ కాగా... తర్వాత వచి్చన శుభమ్ శర్మ, దానిశ్‌లు చక్కని సమన్వయంతో జట్టు స్కోరును పెంచారు.
ఇద్దరు అటు వికెట్‌ను కాపాడుకుంటూనే ఎంచక్కా పరుగులు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో వెస్ట్ బౌలర్లు వికెట్ల తీసేందుకు నానాకష్టాలు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఓపెనర్ మాలేవర్ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. దుర్బేధ్యంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని ఎట్టకేలకు ధర్మేంద్రసింగ్ విడగొట్టడంతో 160 పరుగుల వద్ద సెంట్రల్ రెండో వికెట్‌ను కోల్పోయింది. 93 పరుగుల రెండో వికెట్‌కు భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులో పాతుకుపోయిన శుభమ్ శర్మకు కెప్టెన్ రజత్ పాటీదార్ జతయ్యాడు. వీరిద్దరు కూడా అవలీలగా పరుగులు సాధిస్తూ జట్టు స్కోరును 200 పైచిలుకు పెంచారు. శుభమ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకొని అజేయగా నిలువగా... పాటీదార్ (59 బంతుల్లో 47 బ్యాటింగ్; 8 ఫోర్లు) 3 పరుగుల దూరంలో ఉన్నారు. ప్రస్తుతం 209 పరుగులు వెనుకబడి ఉన్న సెంట్రల్ జోన్ చేతిలో ఇంకా 8 వికెట్లున్నాయి.