
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరోసారి మొండి చేయి చూపించింది. స్వదేశంలో సౌతాఫ్రికా-ఎతో జరగనున్న రెండు మ్యాచ్‌ల అనాధికారిక టెస్టు సిరీస్‌కు ఇండియా-ఎ జట్టును సెలక్టర్లు ప్రకటించారు.
ఈ జట్టులో కూడా షమీకి చోటు దక్కలేదు. కనీసం నాలుగు రోజుల పాటు జరిగే మ్యాచ్‌లకు కూడా అతడిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. షమీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఫిట్‌నెస్ పరంగా మెరుగ్గా కన్పిస్తున్నాడు. అయినప్పటికి సెలకర్ల దృష్టిలో షమీ ఎందుకు లేడో ఆర్ధం కావడం లేదు.
అగార్కర్‌తో విభేదాలు..
అయితే ప్రస్తుతం షమీకి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మధ్య విభేదాలు తలెత్తాయి. షమీ ఇటీవల అగార్కర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన ఫిట్‌గా ఉన్నప్పటికి కావాలనే ఎంపిక చేయడం లేదని షమీ విమర్శించాడు. రంజీల్లో ఆడే వాడిని.. వన్డేలు ఆడలేనా? అని ప్రశ్నించాడు.
షమీ వ్యాఖ్యలపై అగార్కర్ స్పందించాడు. షమీ ఫిట్‌నెస్ గురించి తమకు అప్‌డేట్ లేదని, అతడు తన ముందు ఉండుంటే సమాధానము చెప్పేవాడిని అని అగర్కార్ పేర్కొన్నాడు. అంతేకాకుండా ఫిట్‌గా లేకపోవడం వల్లే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేకపోయామని తన నిర్ణయాన్ని అజిత్ సమర్ధించుకున్నాడు.
అయితే అగార్కర్ కామెంట్స్‌కు షమీ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. "నేను ఫిట్‌గా ఉన్నాను. ఎలా బౌలింగ్ చేస్తున్నారో మీరే చూస్తున్నారు. అతడు ఏం చెప్పుకొన్న పర్వాలేదు" అని షమీ అన్నాడు. ఇప్పుడు ఇండియా-ఎ జట్టుకు కూడా ఎంపిక కాకపోవడంపై షమీ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.
కెప్టెన్‌గా రిషబ్ పంత్..
ఇక ఇది ఇలా ఉండగా.. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పునరాగమనానికి సిద్దమయ్యాడు. సౌతాఫ్రికా-ఎతో సిరీస్‌లో భారత్-ఎ జట్టు కెప్టెన్‌గా పంత్ వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్ సాయిసుదర్శన్ ఎంపికయ్యాడు. తొలి అనాధికారిక టెస్టుకు దూరం ఉన్న స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆడనున్నారు.
సౌతాఫ్రికా- ‘ఎ’తో తొలి ఫోర్-డే మ్యాచ్‌కు భారత జట్టు (అక్టోబరు 30- నవంబరు 2):
రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సారాంశ్ జైన్.
సౌతాఫ్రికా- ‘ఎ’తో రెండో ఫోర్-డే మ్యాచ్‌కు భారత జట్టు (నవంబరు 6- నవంబరు 9):
రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
చదవండి: సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషభ్ పంత్