
చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. జార్ఖండ్ జట్టుతో జరిగిన మూడు రోజుల మ్యాచ్‌లో హైదరాబాద్ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. జార్ఖండ్ నిర్దేశించిన 84 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ 22.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసి నెగ్గింది.
స్కోరు 83 వద్ద అనికేత్ రెడ్డి సిక్స్ కొట్టి హైదరాబాద్ విజయాన్ని ఖరారు చేశాడు. జార్ఖండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లు తనయ్ త్యాగరాజన్ (4/75), రోహిత్ రాయుడు (4/69) రాణించారు. అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 82.4 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటై 47 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.
నితీశ్ రెడ్డి (106; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేయగా... రాహుల్ రాధేశ్ (70; 6 ఫోర్లు, 1 సిక్స్), వరుణ్ గౌడ్ (65; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. 47 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన జార్ఖండ్ 25.3 ఓవర్లలో 130 పరుగులకు కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లు తనయ్ త్యాగరాజన్ (4/74), అనికేత్ రెడ్డి (3/25) ఆకట్టుకున్నారు.
84 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఒకదశలో 61 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. అయితే రోహిత్ రాయుడు (31 బంతుల్లో 18 నాటౌట్; 1 సిక్స్), అనికేత్ రెడ్డి (13 బంతుల్లో 12 నాటౌట్; 1 సిక్స్) తొమ్మిదో వికెట్‌కు 28 పరుగులు జోడించి హైదరాబాద్‌ను విజయతీరానికి చేర్చారు.