IPL 2022: Ricky Ponting Says I Broke 3-4 Remote Controls and a Few Water Bottles - Sakshi
Sakshi News home page

DC VS RR: ఆ మ్యాచ్ చూస్తూ రిమోట్లు, బాటిళ్లు పగులగొట్టా: రికీ పాంటింగ్

Published Wed, Apr 27 2022 5:53 PM

Broke Remote Controls And Few Water Bottles, Ricky Ponting On Watching DC VS RR Match - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఫస్ట్‌ హాఫ్‌ మ్యాచ్‌ల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్- ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైడ్రామా నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్‌ నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి ఓవర్లో ఢిల్లీ కెప్టెన్‌ అతని సహచరులు వ్యవహరించిన తీరు తీవ్ర దుమారాన్ని రేపింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌ఆర్‌.. జోస్‌ బట్లర్‌ విధ్వంసకర శతకంతో (65 బంతుల్లో 116; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) చెలరేగడంతో 222 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేయగా, ఛేదనలో డీసీ లక్ష్యానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీకి చివరి ఓవర్‌లో 36 పరుగులు అవసరం ​కాగా, ఆ దశలో రోవ్‌మన్‌ పావెల్‌ ఒక్కసారిగి విరుచుకుపడి తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచి (మెక్‌ కాయ్‌ బౌలింగ్‌) మ్యాచ్‌ను డీసీ వైపుకు తిప్పాడు. అయితే మెక్‌ కాయ్‌ వేసిన నాలుగో బంతి నడుం కంటే ఎత్తుకు వెళ్లినప్పటికీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ నో బాల్‌గా ప్రకటించకపోవడంతో వివాదం మొదలైంది. అంపైర్‌ నిర్ణయం పట్ల అసహనానికి గురైన డీసీ సారధి పంత్‌ డగౌట్‌లో నుంచి తమ ఆటగాళ్లను వెనక్కు రావల్సిందిగా సైగలు చేశాడు. నో బాల్ విషయంలో పంత్‌ ఇలా వ్యవహరించడాన్ని చాలా మంది తప్పుబట్టారు. 

కాగా, ఈ మ్యాచ్‌ ఆఖర్లో జరిగిన హైడ్రామా మొత్తాన్ని టీవీలో వీక్షించిన ఢిల్లీ హెడ్‌ కోచ్‌ తాజాగా స్పందించాడు. కరోనా బారిన పడటంతో గత కొన్ని రోజులుగా క్వారంటైన్‌లో ఉంటున్న పాంటింగ్‌ నాటి హైఓల్టేజీ మ్యాచ్‌పై మాట్లాడుతూ.. మ్యాచ్‌ చివరి ఓవర్లో తాను కూడా అసహనానికి గురయ్యానని తెలిపాడు. ఆ సమయంలో తాను కోపాన్ని అదుపు చేసుకోలేక 3-4 టీవీ రిమోట్లు పగొలగొట్టానని అన్నాడు. ఫ్రస్ట్రేషన్‌ను కంట్రోల్‌ చేసుకోలేక ఎదురుగా ఉన్న బాటిళ్లను గోడకేసి కొట్టానని వెల్లడించాడు. అలాంటి కీలక సమయంలో తాను జట్టుతో పాటు లేకపోవడం కలచివేసిందని పేర్కొన్నాడు. అయినప్పటికీ టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా జట్టును సమన్వయం చేసుకున్నానని తెలిపాడు.
చదవండి: కెప్టెన్‌ పిలిస్తే ఊపుకుంటూ వెళ్లడమేనా.. కుల్దీప్‌ను మెడపట్టి తోసిన చహల్‌


 

Advertisement
Advertisement