
ఆశల పల్లకిలో భారత బాక్సర్లు
అందరి కళ్లు నిఖత్ పైనే
లవ్లీనా, అమిత్, నిశాంత్‌లపై కూడా దృష్టి
వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ఒలింపిక్స్ బాక్సింగ్ క్రీడాంశంలో భారత్ నుంచి తొలిసారి 1948 లండన్ ఒలింపిక్స్‌లో ఏకంగా ఏడుగురు బాక్సర్లు పోటీపడ్డారు. ఆ తర్వాత 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో నలుగురు భారత బాక్సర్లు బరిలోకి దిగారు. అయితే ఈ రెండు ఒలింపిక్స్‌లో మన బాక్సర్లు ఆకట్టుకోలేకపోయారు. హెల్సింకి ఒలింపిక్స్ తర్వాత మరో నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ నుంచి ప్రాతినిధ్యం కరువైంది. మళ్లీ 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు పోటీపడ్డారు. అప్పటి నుంచి ప్రతి ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేందర్ సింగ్ (75 కేజీలు) కాంస్యం రూపంలో భారత్‌కు బాక్సింగ్‌లో తొలి పతకాన్ని అందించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో మేరీకోమ్ (51 కేజీలు)... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఆరుగురు బాక్సర్లు అర్హత పొందారు. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు)... మహిళల విభాగంలో నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), జైస్మిన్ లంబోరియా (57 కేజీలు), లవ్లీనా (75 కేజీలు) భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు.
ఈ ఆరుగురిలో అమిత్, లవ్లీనాలకు ఇవి రెండో ఒలింపిక్స్‌కాగా... నిశాంత్, నిఖత్, ప్రీతి, జైస్మిన్ తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడనున్నారు. వరుసగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌పైనే అందరి దృష్టి ఉంది. ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకాలు నెగ్గిన నిఖత్ తొలి ప్రయత్నంలోనే ఒలింపిక్ పతకం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
టోక్యోలో కాంస్యం నెగ్గిన లవ్లీనా ఈసారి కూడా అద్భుతం చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్, నిశాంత్ తమ స్థాయికి తగ్గట్టు ఆడితే కాంస్యాలు సాధించే చాన్స్ ఉంది. పారిస్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ పోటీలు జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు జరుగుతాయి. –సాక్షి క్రీడా విభాగం