‘బీసీసీఐ మైండ్‌ గేమ్‌ ఆడుతోంది’

Border Not Happy With Indias Request To Reschedule Test - Sakshi

సిడ్నీ: సమయం దొరికినప్పుడల్లా భారత క్రికెట్‌ కంట్రలో బోర్డు(బీసీసీఐ)పై విరుచుకుపడే ఆస్ట్రేలియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌.. మరొకసారి ధ్వజమెత్తాడు. గతంలో ఐపీఎల్‌ కంటే టీ20 వరల్డ్‌కప్‌కే తన తొలి ప్రాధాన్యత అని బీసీసీఐ వైఖరిని తప్పుబట్టిన బోర్డర్‌.. ఈసారి టీమిండియా మైండ్‌గేమ్‌ ఆడుతోందని విమర్శించాడు. ఎప్పట్నుంచో తమ సాంప్రదాయంగా నిర్వహిస్తున్న న్యూఇయర్‌ టెస్టు మ్యాచ్‌ విషయంలో మార్పులు చేయాలని బీసీసీఐ.. క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)ను కోరడంపై మండిపడ్డాడు. ఇది సరైన వైఖరి కాదంటూ బీసీసీఐ తీరును తప్పుబట్టాడు. ఇక్కడ బీసీసీఐ మైండ్‌ గేమ్‌కు తెరలేపిందన్నాడు.ఈ ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ మార్చి నెలలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను కోవిడ్‌-19 కారణంగా రద్దు చేసుకున్న టీమిండియాకు ఆ తర్వాత ఇదే అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్‌. (చదవండి: అతను చాలా డేంజరస్‌ ప్లేయర్‌: సచిన్‌)

ఈ నెలలో టీ20 వరల్డ్‌కప్‌ ఆరంభం కావాల్సిన ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ కారణంగా అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఆ ప్లేస్‌లో ఐపీఎల్‌ను నిర్వహిస్తోంది బీసీసీఐ. ఇప్పుడు ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఆసీస్‌తో జనవరి 3వ తేదీ నుంచి ఆరంభం కావాల్సి ఉన్న న్యూఇయర్‌ టెస్టు మరింత వెనక్కి జరపాలని బీసీసీఐ కోరింది. జనవరి 7వ తేదీ నుంచి ఆ టెస్టును నిర్వహించాలని బీసీసీఐ తన విజ్ఞప్తిలో పేర్కొంది అయితే  దీనిపై బోర్డర్‌ విరుచుకుపడ్డాడు. ఒక పర్యటనకు ముందు బీసీసీఐ ఇలా కోరడం మైండ్‌ గేమ్‌ కాకపోతే ఏంటని ప్రశ్నించాడు. బాక్సింగ్‌ డే టెస్టు, న్యూ ఇయర్‌ టెస్టు అనేది తమకు ఎప్పట్నుంచో వస్తున్న సాంప్రదాయమని గుర్తు చేశాడు. మరి న్యూఇయర్‌ టెస్టును రీ షెడ్యూల్‌ చేయాలని కోరడం వెనక కారణం ఏమిటని నిలదీశాడు. తమ దేశానికి పర్యటనకు వచ్చే ముందు ఇలా మైండ్‌ గేమ్‌ ఆడతారా అంటూ బీసీసీఐని విమర్శించాడు. వరల్డ్‌ క్రికెట్‌లో తాము శక్తివంతులమని బీసీసీఐ భావిస్తోందని, ఆర్థికంగా బలంగా ఉన్నా విషయాల్లో కచ్చితత్వం అనేది అవసరమని బోర్డర్‌ పేర్కొన్నాడు. నవంబర్‌ చివరి వారంలో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. డిసెంబర్‌-3వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానుంది.(చదవండి: డైలమాలో సన్‌రైజర్స్‌!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top