సిరీస్‌ మనదే.. చివరి టెస్ట్‌ ‘డ్రా’.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా

Border-Gavaskar Trophy 2023 Won by India - Sakshi

ఆఖరి రోజు ఏ మలుపూ లేదు. ఆలౌట్‌ చేయడం మన బౌలర్ల వల్ల కాలేదు. బ్యాటర్ల జోరులో ఏ మార్పూ లేదు. చివరకు ఎలాంటి డ్రామా లేకుండా నాలుగో టెస్టు ‘డ్రా’ అయింది. ఆసీస్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ ఓ పది పరుగులు చేసుంటే ఇంకో ఈ టెస్ట్‌లో ఐదో సెంచరీ అయ్యేది. ఐదు రోజుల పాటు రోజుకో సెంచరీ చొప్పున ఈ మ్యాచ్‌కు అపూర్వ ఘనత దక్కేది. మరోవైపు క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో తొలి టెస్ట్‌లో శ్రీలంక ఓడిపోవడంతో ఈ మ్యాచ్‌ తుది ఫలితంతో సంబంధం లేకుండానే భారత్‌ ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించింది.  

అహ్మదాబాద్‌: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు రోజుల్లో ముగిసిన గత టెస్టులకు భిన్నంగా ఆఖరి మ్యాచ్‌ ‘డ్రా’ అయ్యింది. 2–1తో సిరీస్‌ను వశం చేసుకున్న టీమిండియా ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’ని వరుసగా నాలుగోసారి చేజిక్కించుకుంది. నాలుగో టెస్టు చివరి రోజు కూడా బ్యాటర్స్‌ హవానే కొనసాగింది. దీంతో భారత బౌలర్లు శక్తికి మించి శ్రమించినా రెండు వికెట్లే పడగొట్టగలిగారు.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 78.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (163 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), లబుషేన్‌ (213 బంతుల్లో 63 నాటౌట్‌; 7 ఫోర్లు) రాణించారు. ఫలితానికి అవకాశం లేకపోవడంతో గంట ముందే ‘డ్రా’కు ఇరుజట్ల కెప్టెన్లు అంగీకరించారు.

విరాట్‌ కోహ్లికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించగా... స్పిన్‌తో భారత్‌కు సిరీస్‌ విజయాన్నిచ్చిన బౌలింగ్‌ ద్వయం అశ్విన్‌–రవీంద్ర జడేజాలకు     సంయుక్తంగా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు ఇచ్చారు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఈనెల 17న ముంబైలో జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది.  

హెడ్‌ సెంచరీ మిస్‌... 
ఆఖరి రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 3/0తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా కాసేపటికే ఓపెనర్‌ కునెమన్‌ (6) వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు 14 పరుగుల వద్ద అతని వికెట్‌ను అశ్విన్‌ పడగొట్టగానే భారత శిబిరం సంబరపడింది. ఇక మ్యాజిక్‌ షురూ అనుకుంటే... అక్కడి పిచ్‌ ‘అంతలేదు’ అన్నట్లుగా బ్యాటర్లకే సహకరించింది. దీంతో హెడ్, వన్‌డౌన్‌ బ్యాటర్‌ లబుషేన్‌ నింపాదిగా ఆడుకున్నారు.

రిస్క్‌ తీసుకోకుండా ‘డ్రా’ కోసమే వాళ్లిద్దరు క్రీజుకు అతుక్కుపోయారు. దీంతో భారత బౌలర్లు ఎంత చెమటోడ్చినా తొలి సెషన్‌లో మరో వికెటే దొరకలేదు. 73/1 స్కోరు వద్ద లంచ్‌ విరామానికికెళ్లారు. అనంతరం రెండో సెషన్‌లో హెడ్‌ 112 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... మరికాసేపటి ఆసీస్‌ స్కోరు 100 పరుగులు దాటింది. హెడ్‌ అడపాదడపా బౌండరీలతో పరుగులు సాధించడంతో ఐదో రోజు కూడా సెంచరీ ఖాయమనిపించింది.

కానీ హెడ్‌ అహ్మదాబాద్‌ టెస్టుకు ఆ అరుదైన అవకాశం ఇవ్వకుండా 90 పరుగుల వద్ద అక్షర్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. లబుషేన్‌ 150 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, 158/2 వద్ద రెండో సెషన్‌ ముగిసింది. ‘డ్రా’ దిశగా సాగడంతో మూడో సెషన్‌లో 11 ఓవర్ల ఆటే ఆడారు. సిరీస్‌లో జరిగిన మూడు టెస్టుల్లోనూ 30 పైచిలుకు వికెట్లు మూడు రోజుల్లోనే  రాలితే... ఆఖరి టెస్టు ఐదు రోజులు జరిగినా బౌలర్లు 22 వికెట్లను మించి పడగొట్టలేకపోయారు.  

స్కోరు వివరాలు 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 480;
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 571;
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌:     కునెమన్‌ (ఎల్బీడబ్ల్యూ) అశ్విన్‌ 6; హెడ్‌ (బి) అక్షర్‌ పటేల్‌ 90; లబుషేన్‌ (నాటౌట్‌) 63; స్టీవ్‌ స్మిత్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (78.1 ఓవర్లలో 2 వికెట్లకు డిక్లేర్డ్‌) 175.
వికెట్ల పతనం: 1–14, 2–153.
బౌలింగ్‌: అశ్విన్‌ 24–9–58–1, రవీంద్ర జడేజా 20–7–34–0, షమీ 8–1–19–0, అక్షర్‌  పటేల్‌ 19–8–36–1, ఉమేశ్‌ యాదవ్‌ 5–0–21–0, గిల్‌ 1.1–0–1–0, పుజారా 1–0–1–0. 

మరో మ్యాచ్‌ మిగిలుంది... అదే ఫైనల్‌!
భారత్, ఆస్ట్రేలియాల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ అయితే ముగిసింది. కానీ ఇరుజట్ల మధ్య మరో ‘టెస్టు’ మిగిలుంది! అదేనండి... డబ్ల్యూటీసీ ఫైనల్‌. ఇక్కడ బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ విజేతను తేల్చినట్లే ఇంగ్లండ్‌లో ప్రపంచ టెస్టు చాంపియన్‌ ఎవరో కూడా తేలుతుంది. ఈ ఏడాది జూన్‌లో 7 నుంచి 11 వరకు లండన్‌లోని ది ఓవల్‌ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. 

16 సొంతగడ్డపై భారత జట్టుకిది వరుసగా 16వ టెస్ట్‌ సిరీస్‌ విజయం.

1 మూడు ఫార్మాట్‌లలో (టెస్ట్, వన్డే, టి20) కనీసం 10 చొప్పున ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు గెల్చుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లి ఘనత. 

50 భారత్‌ తరఫున తక్కువ బంతుల్లో టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్‌గా అక్షర్‌ పటేల్‌ గుర్తింపు పొందాడు. కెరీర్‌లో 12 టెస్టులు ఆడిన అక్షర్‌ 2,205 బంతుల్లో 50 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. బుమ్రా (2,465 బంతులు) పేరిట ఉన్న రికార్డును అక్షర్‌ సవరించాడు.  

 టెస్టుల్లో అత్యధిక ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు గెల్చుకున్న ఆటగాళ్ల జాబితాలో అశ్విన్‌ రెండో స్థానానికి చేరుకున్నాడు. అశ్విన్‌ 37 సిరీస్‌లలో 10 సార్లు ఈ పురస్కారం గెల్చుకున్నాడు. ముత్తయ్య మురళీధరన్‌ (62 సిరీస్‌లలో 11 సార్లు) అగ్రస్థానంలో ఉండగా... జాక్వస్‌ కలిస్‌ (61 సిరీస్‌లలో 9 సార్లు) మూడో స్థానానికి పడిపోయాడు.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top