‘హాల్ ఆఫ్ ఫేమ్’ హెడ్ కోచ్ సహా మరో ప్లేయర్ అరెస్టు
దర్యాప్తు చేపట్టిన ఎఫ్‌బీఐ
న్యూయార్క్: అమెరికాలో ఎప్పుడూ ఆటతోనే పతాక శీర్షికలకెక్కే నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) తాజాగా అవినీతి మకిలీతో పత్రికలకెక్కింది. ఇన్‌సైడ్ ఇన్‌ఫర్మెషన్ (జట్టు అంతర్గత సమాచారం) లీక్ చేసి బెట్టింగ్‌కు పాల్పడటం, మాఫియా కుటుంబాలతో కలిసి క్రీడా పందెంల రిగ్గింగ్, పోకర్ గేమ్‌ల అనుచిత కార్యకలాపాలు ఎన్‌బీఏకు మచ్చతెచ్చాయి.
దీంతో రంగంలోకి దిగిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) పోర్ట్‌లాండ్ ట్రెయిల్ బ్లేజర్స్ జట్టు హెడ్ కోచ్ చౌన్సే బిలప్స్, మయామి హీట్ జట్టు ప్లేయర్ టెర్రీ రోజియెర్ సహా 30 మందికి పైగా అరెస్టు చేసింది. దీనిపై ముమ్మర దర్యాప్తు చేపట్టినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ వెల్లడించారు. భారత సంతతికి చెందిన కశ్యప్ ప్రమోద్ పటేల్ ఆధ్వర్యంలోనే ఈ కేసు విచారణ జరుగుతోంది.
గత కొన్నేళ్లుగా భారీఎత్తున ఈ బెట్టింగ్ మాఫియా మిలియన్ డాలర్లను ఆర్జించినట్లు ఎఫ్‌బీఐ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పెద్ద ఎత్తున జరిగిన నేరపూరిత కుట్రలో ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఉన్న కోచ్ బిలప్స్ ఉండటం ఎన్‌బీఏ వర్గాలను విస్మయపరిచింది. అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఫిక్సింగ్ కార్యకలాపాల్లో బిలప్స్ హస్తముండగా, మయామి హీట్ ప్లేయర్ రోజియెర్ జట్టు గోప్యతకు భంగం కలిగేలా అంతర్గత సమాచారం లీక్ చేసి స్పాట్ బెట్టింగ్ తరహా మోసాలకు పాల్పడినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కశ్యప్ తెలిపారు.
బిలప్స్, రోజియెర్‌లవి రెండు వేర్వేరు కేసులు కాగా, ఈ రెండు కేసుల్లోనూ మాజీ ఎన్‌బీఏ సహాయ కోచ్, మాజీ ఆటగాడు డామన్ జోన్స్ నిందితుడని ఎఫ్‌బీఐ అధికారులు తెలిపారు.
మరి ఎన్‌బీఏ ఏం చేసింది
ఎన్‌బీఏ ప్రతిష్టకే మచ్చతెచ్చిన వ్యవహారంపై ఎన్‌బీఐ యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. రిగ్గింగ్, బెట్టింగ్, ఫిక్సింగ్ ఆరోపణల్లో అరెస్టయిన బిలప్స్, రోజియెర్, డామన్ జోన్స్‌లపై వేటు వేసింది. ఎన్‌బీఏ క్రీడా సమగ్రతను కాపాడేందుకు ఎఫ్‌బీఐ అధికారులు, పోలీసులు చేసే విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఎన్‌బీఏ ఒక ప్రకటనలో పేర్కొంది.
గతంలో 2007లో కూడా ఎన్‌బీఏను బెట్టింగ్ ఉదంతం ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పుడు రిఫరీ టిమ్ డొనగే మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లతో ఎన్‌బీఏకు మచ్చ తెచ్చారు. ఆ తర్వాత కూడా బ్రాడ్‌కాస్టింగ్ ఒప్పందంలో అనివీతి ఆరోపణలతో ఎన్‌బీఐ ప్రతిష్ట మసకబారింది.


