
పాక్‌తో ఉద్రిక్త పరిస్థితలు నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ మంత్రి నేతృత్వం వహిస్తున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనకూడదని డిసైడ్ చేసుకుంది. ఏసీసీ ఆథ్వర్యంలో జరిగే ఈవెంట్లలో భారత క్రికెట్ జట్లు (పురుషులు, మహిళలు) పాల్గొనవని స్పష్టం చేసింది.
వచ్చే నెలలో శ్రీలంకలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్,ఆ తర్వాత సెప్టెంబర్‌లో భారత్ వేదికగా జరగాల్సిన ద్వైవార్షిక పురుషుల ఆసియా కప్ నుండి వైదొలుగుతున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఏసీసీకి కూడా తెలియజేసింది. క్రికెట్‌కు సంబంధించి పాక్‌ను ఒంటరి చేయడమే లక్ష్యంగా ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది.
కాగా, పాకిస్తాన్‌కు చెందిన మంత్రి మొహిసిన్ నఖ్వీ ఇటీవలే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. నఖ్వీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) కూడా చైర్మన్‌గా వ్యవహరిస్తూ, జోడు పదవులను అనుభవిస్తున్నాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. రోస్టర్ విధానంలో ఏసీసీ చైర్మన్ ఎంపిక జరుగుతుంది. ఈ క్రమంలో ఈ దఫా పాకిస్తాన్‌కు అవకాశం వచ్చింది. అంతకుముందు ఏసీసీ చైర్మన్‌గా ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడు జై షా ఉండేవాడు. షా.. ఐసీసీ పదవి చేపట్టాల్సి ఉండటంతో ఏసీసీ చైర్మన్‌గిరికి ముందుగానే రాజీనామా చేశాడు.
ఇదిలా ఉంటే, భారత్ పురుషుల ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆ టోర్నీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ టోర్నీ భారత్‌లోనే జరగాల్సి ఉన్నా పాక్ మంత్రి ఏసీసీ చైర్మన్‌గా ఉన్నందుకు బీసీసీఐ ససేమిరా అంటుంది. ఆసియా కప్‌లో భారత్ పాల్గొనపోతే టోర్నీ జరగడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లకు స్పాన్సర్లలో ఎక్కువ మంది భారత్‌కు చెందిన వారే ఉన్నారు. వీరు స్పాన్సర్‌షిప్‌కు ముందుకు రాకపోతే టోర్నీ జరుగదు.
పెహల్గామ్ దాడితో మొదలు..
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నాయి. ఈ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్‌లో తలదాచుకున్న ఉగ్రమూకలపై దాడి చేసింది. భారత్ దాడులకు పాక్ బదులిచ్చే ప్రయత్నం చేయగా.. భారత బలగాలు వారికి తగు రీతిలో బుద్ది చెప్పాయి. తదనంతరం పరిణామాల్లో భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నాయి.