ఆర్సీబీ కింగ్‌ మేకర్‌పై చర్యలు | BCCI Punishes RCB Kingmaker For Major IPL Code Of Conduct Violation | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ కింగ్‌ మేకర్‌పై చర్యలు

May 11 2026 10:14 AM | Updated on May 11 2026 11:17 AM

BCCI Punishes RCB Kingmaker For Major IPL Code Of Conduct Violation

ఆర్సీబీ కింగ్‌ మేకర్‌, ఆ జట్టు హెడ్‌ కోచ్‌ ఆండీ ఫ్లవర్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (మే 11) రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  అతడు ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ చర్య ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లో లెవెల్‌-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. దీనికి శిక్షగా ఫ్లవర్‌కు మ్యాచ్‌ ఫీజ్‌లో 15 శాతం జరిమానా విధించారు. లెవెల్ 1 ఉల్లంఘనల కింద కోచ్‌లపై కూడా చర్యలు తీసుకునే అధికారం మ్యాచ్ రిఫరీకి ఉంటుంది.

ఐపీఎల్‌లో ఇలాంటి ఉదంతాలు చాలా అరుదుగా జరిగాయి. గత సీజన్‌లో గుజరాత్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా కూడా ఇలాగే ప్రవర్తించి శిక్షించబడ్డాడు. అప్పట్లో అతని మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం కోత విధించారు. అదే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ కోచ్‌ మునాఫ్‌ పటేల్‌ కూడా లెవెల్‌-1 ఉల్లంఘనకు పాల్పడి బీసీసీఐ ఆగ్రహానికి (25 శాతం జరిమానా) గురయ్యాడు.

దీనికి ముందు 2024 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ కీరన్‌ పోలార్డ్‌.. 2022 ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రే కూడా అంపైర్లతో వాదించి శిక్షించబడ్డారు. వీరిలో ఆమ్రే ఏకంగా ఓ మ్యాచ్‌ నిషేధానికి కూడా గురయ్యాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇన్నింగ్స్‌ చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో రసిక్‌ సలామ్‌ ఆర్సీబీని గెలిపించాడు. అంతకుముందు నాలుగో బంతికి భువనేశ్వర్‌ కుమార్‌ సిక్సర్‌ బాది గెలుపు ఖరారు చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా.. ఆర్సీబీ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ పోరాటం ముగిసింది. మరో 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఎంఐతో పాటు లక్నో సూపర్‌ జెయింట్స్‌ కూడా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఎలిమినేట్‌ అయ్యింది.

Advertisement
 
Advertisement
Advertisement