
ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (CAU)లో రూ.12 కోట్ల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఏయూ భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని.. టోర్నమెంట్స్ కోసం కేటాయించిన ఫండ్స్‌ను దారిమళ్లించారని, వాటిపై విచారించాలని కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి.
దీంతో ఆరోపణలపై విచారణ జరిపించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI)కి ఉత్తరాఖండ్ హైకోర్టు బుధవారం నోటీసు జారీ చేసింది. ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ ఆడిట్ నివేదిక ఆధారంగా ఆటగాళ్లకు అరటిపండ్ల కోసం రూ.35 లక్షలకు ఖర్చు చేశారని పిటిషనర్ ఆరోపించారు.
2024-25 ఏడాదికి గానూ సీఏయూ ఆడిట్ నివేదికపై దర్యాప్తును కోరుతూ సంజయ్ రావత్ అనే వ్యక్తి వాజ్యం దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మనోజ్ కుమార్ తివారీ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. ఈ ఫిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
ఆడిట్ రిపోర్ట్ ప్రకారం.. రాష్ట్ర క్రికెట్ బోర్డు నిర్వహించే అన్ని టోర్నమెంట్లకు సీఎయూ భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈవెంట్ మెనెజ్‌మెంట్ ఫీజుల కోసం రూ.6.4 కోట్లు, టోర్నమెంట్ల నిర్వహణ, ట్రయల్స్ కోసం రూ.26.3 కోట్లు చేసినట్లు సంజయ్ రావత్ తన ఫిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా ఈ ఖర్చు గత ఆర్ధిక సంవత్సరంలో రూ. 22.30 కోట్లే ఉంది. ముఖ్యంగా ఆహార ఖర్చుల పేరుతో అసోసియేషన్ కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసిందన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. దీనిపై బీసీసీఐ విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమర్పించనుంది.
చదవండి: ఆ జట్టు ఓటమి ఖాయమే!.. టీమిండియా నుంచి ఎవరిని తప్పిస్తారు?: అక్తర్