ఐపీఎల్‌లో పది జట్లు | BCCI approves 10-teams IPL from 2022 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌లో పది జట్లు

Dec 25 2020 4:03 AM | Updated on Dec 25 2020 5:06 AM

BCCI approves 10-teams  IPL from 2022 - Sakshi

అహ్మదాబాద్‌: ఏటికేడు ఆదరణలో ఆకాశాన్ని తాకేందుకు పోటీపడుతున్న ఐపీఎల్‌ను మళ్లీ పది జట్లతో విస్తరించేందుకు బోర్డు అమోదం తెలిపింది. 2011లో లీగ్‌లో పది జట్లు ఆడాయి. కొచ్చి టస్కర్స్‌ కేరళ, పుణే సహారా వారియర్స్‌ జతకలిశాయి. కానీ మరుసటి ఏడాదికే కొచ్చి కథ ముగిసిపోగా తర్వాత 9 జట్లకు పరిమితమైంది. కొన్నేళ్ల తర్వాత పుణే తప్పుకోవడంతో తదనంతరం 8 జట్లతో ఐపీఎల్‌ స్థిరపడింది. అయితే మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా... 2022 నుంచి 10 జట్లతో నిర్వహించాలని ఏజీఎంలో నిర్ణయించారు. గురువారం ఇక్కడ జరిగిన 89వ సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో పలు కీలకాంశాలపై చర్చించిన బోర్డు ప్రపంచకప్‌ ఆతిథ్యాన్ని వదులుకునే ప్రసక్తే లేదని... పన్ను మినహాయింపులకు మరో ప్రత్యామ్నాయం చూపింది. దేశవాళీ ఆటగాళ్లను ఆదుకోవాలని, మహిళల క్రికెట్లో మరిన్ని వయో విభాగం టోర్నీలను జతచేయాలని నిర్ణయించింది. బోర్డులో రాజీవ్‌ శుక్లా తిరిగి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యా రు.

ఒలింపిక్స్‌కు సరే కానీ...
ఒలింపిక్స్‌ ఆడితే ఐఓఏ గొడుగు కిందకు రావాలి... స్పోర్ట్స్‌ కోడ్‌ను అనుసరించాలి... ఇవన్నీ బోర్డు స్వయంప్రతిపత్తికి ఇబ్బందికరమని భావించిన బీసీసీఐ... విశ్వక్రీడల్లో టి20 క్రికెట్‌పై ఆసక్తి కనబరచలేదు. అయితే ఈ సమావేశంలో అనూహ్యంగా బోర్డు ఒలింపిక్స్‌కు జై కొడుతూనే... ఈ అంశంలో మాకు మరింత సమాచారం, స్పష్టత కావాలని ఐసీసీని కోరింది. అన్ని అనుమానాలు నివృత్తి అయితే ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అంతా బీసీసీఐ అనుకున్నట్లు జరిగితే 2028లో లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో టి20 మెరుపుల్ని చూడొచ్చు. బోర్డు స్వతంత్రతకు భంగం కలగనంత వరకు ఒకే కానీ తప్పనిసరిగా ఐఓఏ ఆజమాయిషీలో ఉండాలంటే కుదరదని ఏజీఎంలో పాల్గొన్న రాష్ట్ర సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు.

ఐసీసీ ఆదాయం నుంచి...
ప్రపంచకప్‌ ఆతిథ్య దేశం నుంచి పన్ను మినహాయింపులు కావాల్సిందేనని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) పట్టుబడుతోంది. లేదంటే వేరే దేశానికి మెగా ఈవెంట్‌ను తరలించక తప్పదని చెప్పింది. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన బోర్డు సభ్యులు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపారు. ఆతిథ్యం వదులుకోం... అలాగే ఐసీసీని నష్టపరచమనే విధంగా నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మినహాయింపు పొందితే సరే! లేదంటే ఏటా ఐసీసీ నుంచి భారత్‌కు వచ్చే 390 మిలియన్‌ డాలర్లు (రూ.2868 కోట్లు) ఆదాయ పంపిణీ నుంచి 123 మిలియన్‌ డాలర్లు (రూ. 904 కోట్లు) మినహాయించుకోవాలని ఏజీఎంలో నిర్ణయించారు.

క్రికెటర్లకు పరిహారం
కోవిడ్‌ మహమ్మారి వల్ల దేశవాళీ క్రికెట్‌ సీజన్‌ అంతా తుడిచిపెట్టుకుపోయింది. కుర్రాళ్లకు    ప్రతిభ కనబరిచే వేదిక లేక డీలా పడిపోయారు. మ్యాచ్‌ ఫీజుల రూపేణా ఆదాయాన్ని కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశవాళీ క్రికెటర్లలో స్థైర్యాన్ని నింపేందుకు బోర్డు వారందరికీ పరిహారం ఇవ్వాల ని నిర్ణయించింది. మహిళా క్రికెటర్లకు కూడా ఈ మేరకు పరిహారం అందనుంది. అలాగే మహిళల క్రికెట్లో ఒకటి అరా టోర్నీలు కాకుండా సీనియర్, జూనియర్‌ స్థాయిల్లో మరిన్ని వయో విభాగం టోర్నమెంట్లు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. భారత సీనియర్‌ మహిళల జట్టుకు వచ్చే ఏడాది రెండు సిరీస్‌లను ఏర్పాటు చేశారు.

60 ఏళ్లదాకా అంపైరింగ్‌
బీసీసీఐ అంపైర్ల పదవీ విరమణ వయస్సును ఐదేళ్లు పెంచారు. ఇప్పటిదాకా 55 ఏళ్ల వరకు అంపైర్లు, స్కోరర్లుగా పనిచేసి రిటైర్‌ అయ్యేవారు. ఇకపై వీరంతా 60 ఏళ్ల దాకా విధులు నిర్వహించవచ్చు. గేమ్‌ డెవలప్‌మెంట్‌ జనరల్‌ మేనేజర్‌ కేవీపీ రావుపై బోర్డు వేటు వేసింది. కరోనా పరిస్థితుల్లో మూలన పడిన టోర్నీల విషయంలో నిర్లిప్తంగా వ్యవహరించడంతో ఆయన్ని రాజీనామా చేయాల్సిందిగా బోర్డు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement