శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత ‘ఎ’ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్, అస్సాం స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్ గాయం కారణంగా లంక టూర్‌కు దూరమయ్యాడు. అతడి స్దానాన్ని మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌తో బీసీసీఐ భర్తీ చేసింది.
తిలక్ వర్మకు డిప్యూటీగా గైక్వాడ్ వ్యవహరించనున్నాడు. గైక్వాడ్ దాదాపు ఏడాది తర్వాత ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ సీఎస్‌కే కెప్టెన్ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమతవుతున్నాడు. ఐపీఎల్-2026లో రుతురాజ్ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం 337 పరుగులు చేశాడు. అయితే రుతు తన ఫామ్‌ను తిరిగి అందుకోవడానికి ఈ టూర్ మంచి అవకాశం.
ఇక పరాగ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభంలోనే హ్యామ్‌స్ట్రింగ్ (Hamstring) గాయానికి గురయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ మధ్యలోనే గాయం కారణంగా మైదానాన్ని వీడాడు.ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌లకు దూరమైనప్పటికీ, జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉండటంతో నొప్పితోనే తిరిగి జట్టులోకి వచ్చాడు.
కానీ రాజస్తాన్ ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. అయితే ఇప్పుడు అతడు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో లంక పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రుతురాజ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
అతడు చివరగా 2025లో ఇండియా-ఎ తరపున సౌతాఫ్రికా-ఎపై ఆడాడు. ఆ సిరీస్‌లో గైక్వాడ్ 210 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. కాగా లంక టూర్‌లో భాగంగా భారత్-ఎ జట్టు.. శ్రీలంక-ఎ, అఫ్గానిస్తాన్-ఎ టీమ్స్‌తో ముక్కోణపు వన్డే సిరీస్‌లో తలపడనుంది.
శ్రీలంక సిరీస్ కోసం ఇండియా-ఎ జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, సూర్యాంశ్ శెడ్గే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యష్ ఠాకూర్, యుధ్‌వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్.


